ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం చేస్తే ఇక ఊరుకోం

15 Jan, 2017 20:58 IST|Sakshi
ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం చేస్తే ఇక ఊరుకోం

ఫ్రాంక్ ఫర్ట్ :
ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఫేస్ బుక్ ను వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా దేశంలోని దాదాపు 90 శాతం మీడియా హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని చెప్పగా, అనూహ్యంగా ట్రంప్ ఎన్నికయ్యారు. ఈ అంచనాల విషయంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని అంతగా పసిగట్టకపోవడం ఒక కారణంగా చెబుతారు. సోషల్ మీడియాకు ప్రధాన వేదికైన ఫేస్ బుక్ లో ట్రంప్ తరఫున విస్తృత ప్రచారం జరిగిందనేది అమెరికన్ల వాదన. ఈ వివాదంలో ఫేస్ బుక్ ఆ తర్వాత పెద్ద వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది కూడా.

అమెరికాలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో యూరోప్ లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో కూడిన జర్మనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జర్మనీ పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరిగే తప్పడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడి ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు, విదేశీయులు ఫేక్ న్యూస్ ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జర్మనీ రాజకీయ వేత్తలు హెచ్చరించారు. దాంతో ఫేస్ బుక్ స్పందించింది. తప్పుడు వార్తల ప్రచారంపై  కట్టడి విధించింది. తప్పుడు వార్తలను పోస్టు చేసినట్టయితే, స్వతంత్రంగా పనిచేసే నిజ నిర్ధారణ సంస్థల ద్వారా వాటిని గుర్తించడమే కాకుండా అవి పోస్టు చేసిన వారిపై తగిన చర్యలకు ఉపక్రమిస్తామని ఫేస్ బుక్ ఆదివారం తెలియజేసింది.

>
మరిన్ని వార్తలు