ఆస్ట్రేలియాకు ఫేస్‌బుక్‌ షాక్‌

15 Jun, 2020 17:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ షాకిచ్చింది. ఫేస్‌బుక్‌ సం‍స్థకు మీడియా ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూలో(ఆదాయం) చెల్లించాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని ఫేస్‌బుక్ తిరస్కరించింది.  అయితే, మీడియా ద్వారా సేకరిస్తున్న సమాచారం వల్ల తమకు వాణిజ్య పరంగా ఎలాంటి ఉపయోగం లేదని, కావాలంటే మీడియా సమాచారాన్ని ఫేస్‌బుక్‌ ఫ్లాట్‌ఫార్మ్‌లో ఉపయోగించమని సంస్థ తెలిపింది. అయితే గూగుల్‌, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలు మీడియా సమాచారాన్ని ఉపయోగించినందుకు ప్రకటనల ద్వారా వచ్చే లాభాలలో కొంత మీడియాకు చెల్లించే విధంగా కృషి చేయాలని ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ)ను ప్రభుత్వం ఆదేశించింది.  

ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌, గూగుల్‌లకు ఉన్న బ్రాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రకటనల ద్వారా ఆదాయాన్ని ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఆసీస్‌ దిగ్గజ మీడియా సంస్థలైన రూపెర్ట్ ముర్డోచ్, న్యూస్ కార్ప్ లాంటి సంస్థల ప్రోద్బలం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా గత కొంత కాలంగా ఆన్‌లైన్‌ ప్రకటనల ద్వారా మీడియా సమాచారాన్ని వాడుకొని ఫేస్‌బుక్‌ సంస్థ లాభాలను అర్జిస్తుందని ఇటీవల రూపెర్ట్ ముర్డోచ్, న్యూస్ కార్ప్ సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో పత్రికా రంగాన్ని కాపాడాలంటే వాటికి వచ్చే నష్టాలను అధ్యయనం చేసి, పరిష్కారం  చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. (చదవండి: జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్)

మరిన్ని వార్తలు