అన్నీ అడ్డదారులే...!

20 Mar, 2018 21:34 IST|Sakshi

హనీట్రాప్‌ సహా తప్పుడు వార్తల ప్రచారం,మాజీ గూఢచారుల సేవలు...

 ఫేస్‌బుక్‌ యూజర్ల వ్యక్తిగత  సమాచారాన్ని  దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న  కేంబ్రిడ్జి అనాలిటికా (సీఏ) సంస్థ మరిన్ని వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్ల ఎన్నికల ప్రచారాన్ని వారికి అనుకూలంగా మార్చేందుకు అమ్మాయిలతో హనీట్రాప్‌ మొదలుకుని తప్పుడు వార్తల ప్రచారం, మాజీ గూఢచారులతో కార్యకలాపాలు నిర్వహించినట్టు ఓ వార్తాసంస్థ పరిశోధనలో వెల్లడైంది.  తప్పుడు పద్ధతుల ద్వారా  ఫేస్‌బుక్‌ యూజర్ల రాజకీయమొగ్గు, ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారన్న అంతర్గత  సమాచారం, వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకుని తదనుగుణంగా తమ క్లయింట్లకు ప్రయోజనం కలిగేలా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసిందన్న తీవ్ర ఆరోపణలకు ఈ సంస్థ గురైంది.

ఈ నేపథ్యంలో ప్రత్యర్థి అభ్యర్థులపై అవినీతిఆరోపణల ఉచ్చు, వ్యభిచారిణుల వినియోగం వంటి  చీకటి ఒప్పందాలకు  సీఏ దిగజారడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని  సీఏ సీఈఓ అలెగ్జాండర్‌ నిక్స్‌ వెల్లడించగా, బీబీసీ ఛానెల్‌ 4 న్యూస్‌ రిపోర్టర్ల స్టింగ్‌ ఆపరేషన్‌లో రికార్డయింది. ప్రత్యర్థిపార్టీల అభ్యర్థుల ఇళ్లకు అందమైన అమ్మాయిలను పంపించి తమకు కావాల్సిన పని  పూర్తి చేసుకోవడం తమకు మామూలేనంటూ నిక్స్‌ పేర్కొనడం ఆ సంస్థ అనైతిక కార్యకలాపాలను ఎత్తిచూపుతోంది.  బ్రిటన్, ఇజ్రాయిల్‌లలో రాజకీయనేతల తెరవెనక సమాచారసేకరణ కోసం మాజీ గూఢచారుల సేవలను వినియోగించుకున్నట్టు కూడా నిక్స్‌ వెల్లడించాడు.

  ఫేస్‌బుక్‌ వివరాలను  సీఏ ఎలా ఉపయోగించింది, ఆ సమాచారం  ప్రచారానికి ఏ  విధంగా ఉపయోగపడిందన్న దానిపై  అమెరికా, బ్రిటన్‌ రాజకీయవేత్తలు దృష్టి కేంద్రీకరించడంతో ఆ సంస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటోంది. ఛానల్‌ 4 స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైన అంశాలను సీఏ త్రోసిపుచ్చింది. తాము హనీ ట్రాప్, ప్రలోభపరిచే ఇతర అనైతిక చర్యలకు పాల్పడలేదని, వాస్తవం కాని సమాచారాన్ని దేన్నీ కూడా తమ ప్రచారానికి,ఇతర అవసరాలకు ఉపయోగించలేదని ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. - సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు