ఇంటర్నెట్‌ లేకున్నా ఫేస్‌బుక్ చూడొచ్చు!

11 Dec, 2015 11:33 IST|Sakshi
ఇంటర్నెట్‌ లేకున్నా ఫేస్‌బుక్ చూడొచ్చు!

ఫేస్‌బుక్‌ యూజర్లకు శుభవార్త. ఇక నుంచి ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో లేకున్నా ఫేస్‌బుక్‌ను చూడొచ్చు. ఫేస్‌బుక్‌లోని పోస్టులపై కామెంట్లూ పెట్టొచ్చు. ఈ మేరకు తమ వెబ్‌సైట్‌ను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ప్రకటించింది. ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉన్నా న్యూస్‌ఫీడ్‌ను అందుబాటులో ఉంచేలా చూడనున్నట్టు తెలిపింది.

భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో మొబైల్ ద్వారా 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని ఫేస్‌బుక్‌ను చూసే యూజర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ సంస్థ ఆ యూజర్లకు మరింత అందుబాటులో ఉండేలా కొత్త అప్‌డేట్‌ను ప్రస్తుతం పరీక్షిస్తుంది. దీనిప్రకారం ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయిన ఫేస్‌బుక్‌ స్టోరీలను తర్వాత కూడా చూడవచ్చు.

యూజర్ల రెలెవెన్స్ ఆధారంగా న్యూస్‌ఫీడ్‌లో ఈ స్టోరీలు కనబడతాయి. అదేవిధంగా మెరుగైన నెట్‌ కనెక్షన్ ఉన్నప్పుడు రోజంతా ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు న్యూస్‌ఫీడ్‌లోకి వచ్చేలా మెరుగులు దిద్దుతున్నది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఫేస్‌బుక్‌లోని పోస్టులపై కామెంట్లు పెట్టడం ఇప్పుడు సాధ్యమేనని, నెట్‌ కనెక్షన్ అందుబాటులోకి రాగానే కామెంట్లు ఆటోమేటిక్‌గా అప్‌లోడ్‌ అవుతాయని తెలిపింది. ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకునేలా రూపొందించిన సరికొత్త న్యూస్‌ఫీడ్ ఫీచర్స్ ఫేస్‌బుక్‌ ప్రస్తుతం పరీక్షిస్తున్నది.
 

మరిన్ని వార్తలు