మరో వివాదంలో ఫేస్‌బుక్‌

4 Jan, 2019 03:15 IST|Sakshi

ఫేస్‌బుక్‌కు డేటా చేరవేస్తున్న యాప్స్‌

‘నాకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ లేదు. కాబట్టి నా వివరాలేవీ వాళ్లకు తెలియవు’ అన్న ధీమాలో మీరుంటే పొరపాటు పడ్డట్టే! మీకు ఫేస్‌బుక్‌ ఖాతా లేకపోయినా, మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో వాడే ఇతర యాప్‌ల ద్వారా మీ గుట్టంతా ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్‌కు వెళ్లిపోతోందట. బ్రిటన్‌కు చెందిన ప్రైవసీ ఇంటర్నేషనల్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. సాధారణంగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లు అనేక యాప్స్‌ను వాడుతుంటారు.

వాళ్లు ఏ యాప్‌ను ఓపెన్‌ చేసినా వారి సమాచారం అంతా ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్‌కు చేరిపోతోందని ఈ అధ్యయనంలో తేలింది. ఫేస్‌బుక్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కిట్‌(ఎస్‌డీకే) ద్వారా ఈ యాప్‌ డెవలపర్లు యూజర్ల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నారు. గతేడాది ఆగస్టు–డిసెంబర్‌ నెలల మధ్య కోటి నుంచి 50 కోట్లమంది యూజర్లు వాడుతున్న 34 యాప్‌లను పరిశీలించిన అనంతరం ప్రైవసీ ఇంటర్నేషనల్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ జాబితాలో డ్యుయోలింగో, ట్రిప్‌ అడ్వైజర్, ఇన్‌డీడ్, స్కైస్కానర్‌ వంటి యాప్‌లు ఉన్నాయి.

ఈ యాప్‌లు ప్రధానంగా ఎలాంటి సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు అందజేస్తున్నాయో కూడా ఈ సంస్థ విశ్లేషించింది. 61 శాతం యాప్స్‌ను యూజర్లు ఓపెన్‌చేయగానే వారి సమాచారం ఫేస్‌బుక్‌కు చేరిపోతుందని తెలిపింది. ఈ యాప్స్‌ పంపిన సమాచారాన్ని గూగుల్‌ అడ్వర్‌టైజింగ్‌ ఐడీ ద్వారా ఇతరులు పంచుకుంటున్నారని వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా ప్రకటనకర్తలు యూజర్ల ప్రొఫైల్స్‌ను రూపొందించి వారికి అనుకూలమైన, ఆసక్తి కలిగించే ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొంది. జర్మనీలోని లీపింగ్‌లో జరిగిన కాస్‌ కంప్యూటర్‌ కాంగ్రెస్‌లో ప్రైవసీ ఇంటర్నేషనల్‌ ఈ నివేదికను సమర్పించింది.

ఇదంతా మామూలే: ఫేస్‌బుక్‌
ప్రైవసీ ఇంటర్నేషనల్‌ నివేదికపై ఫేస్‌బుక్‌ స్పందించింది. యూజర్ల సమాచారాన్ని కంపెనీలు పంచుకోవడమన్నది చాలా మామూలు విషయమని తెలిపింది. దీనివల్ల వినియోగదారులతో పాటు కంపెనీలకు కూడా లాభం చేకూరుతుందని వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా డెవలపర్లు తమ యాప్‌ను మరింత బాగా తయారుచేయగలరంది.

మరిన్ని వార్తలు