టీఆర్పీల కోసం పిల్లాడిని చంపేయకండి

10 Mar, 2020 15:02 IST|Sakshi

మరుగుజ్జు తనపాలిట శాపంగా భావించి ఆత్మహత్య చేసుకుంటానంటూ గుండెలవిసేలా రోదించిన పిల్లవాడు క్వాడెన్‌ బేల్స్‌ మీకు గుర్తుండే ఉంటుంది. అతను ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. కాగా అతను మూడు సంవత్సరాల కిత్రం ఆత్మహత్యాయత్నం చేశాడని ఆమె తల్లి చెప్పడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన క్వాడెన్‌ అచాన్రోప్లాసియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. శారీరక ఎదుగుదల లోపం కారణంగా తోటి విద్యార్థుల దగ్గర అవమానాలు ఎదుర్కొన్నాడు. అతన్ని హేళన చేస్తూ వేధింపులకు గురిచేయడం భరించలేకపోయాడు. తల్లి యర్రాకతో తన బాధను చెప్పుకుంటూ కుప్పకూలిపోయాడు. ‘నేను.. ఉరేసుకుంటా.. పోనీ ఎవరైనా నన్ను చంపేయండి’ అంటూ హృదయవిదారకంగా ఏడ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను తల్లి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ బాలుడికి సోషల్‌ మీడియా అండగా నిలిచిన విషయం తెలిసిందే. (తాడు ఇవ్వండి! ఉరేసుకుంటా..)

బీబీసీ పేరిట ప్రసారమవుతున్న తప్పుడు వార్త

నాలుగు లక్షలకు పైగా డాలర్లు పోగు చేసి అతనికి అందించగా వారు దాన్ని ఓ చారిటీకి ఉపయోగించనున్నట్లు తెలిపారు. తాజాగా ఆ పిల్లవాడి గురించి గత కొద్ది రోజులుగా ఓ విషాద వార్త చక్కర్లు కొడుతోంది. అతను ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఆ వార్త సారాంశం. దీనికి బీబీసీ చానల్‌ లోగోనుపయోగించి ఓ వీడియోను కూడా జత చేయగా ఆ వార్త వైరల్‌గా మారింది. దీంతో పలు వెబ్‌సైట్లు సైతం అతని ఆత్మహత్యపై వార్తాకథనాలు వెలువరించాయి. దీనిపై స్పందించిన బీబీసీ యాజమాన్యం తాము ఆ వార్తను ప్రసారం చేయలేదని, అది అసత్య ప్రచారమేనని స్పష్టం చేసింది. దీంతో బాలుడి ఆత్మహత్య వట్టి పుకారేనని తేలింది. ఇక అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు తప్పుడు ప్రచారం చేసినవారిని దుమ్మెత్తిపోస్తున్నారు. ‘మీ టీఆర్పీల కోసం ఆ పిల్లవాడిని చంపేయకండి’ అని ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు.(ఆ చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు.. ఏం చేస్తారంటే..)

మరిన్ని వార్తలు