కరోనా: 300 మందిని బలిగొన్న విష ప్రచారం

27 Mar, 2020 14:59 IST|Sakshi

టెహ్రాన్‌ : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఇరాన్‌లో భయానక పరిస్థితి నెలకొంది. ప్రాణాంతక వైరస్‌ సోకుతుందనే భయంతో ప్రజలు ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. మెథనాల్‌ను తాగడంతో ఇప్పటివరకు ఇరాన్‌లో 300 మంది మరణించగా, 1000 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ఇరాన్‌ మీడియా పేర్కొంది. ఇరాన్‌లో ఆల్కహాల్‌పై నిషేధం అమల్లో ఉండగా సోషల్‌మీడియాలో కరోనాకు విరుగుడు అంటూ సాగుతున్న ప్రచారంతో ఇలాంటి అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. విస్కీ, తేనె సేవించడం ద్వారా కరోనా వైరస్‌ నుంచి బ్రిటన్‌ టీచర్‌ సహా మరికొందరు బయటపడ్డారని ఇరాన్‌ సోషల్‌మీడియాలో మెసేజ్‌లు ముంచెత్తడంతో ప్రజలు ఇలాంటి తప్పుడు సలహాలకు ప్రభావితమై ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు.

ఆల్కహాల్‌తో కూడిన హ్యాండ్‌ శానిటైజర్ల వాడకంపై సాగిన ప్రచారంతో కొందరు అత్యంత ప్రభావవంతమైన ఆల్కహాల్‌ను సేవిస్తే అది వైరస్‌ను చంపివేస్తుందనే అపోహతో మెథనాల్‌ను తీసుకుంటున్నారు. ఆల్కహాల్‌ జీర్ణ వ‍్యవస్థను పరిశుద్ధం చేస్తుందనే ప్రచారంలో నిజం లేదని ఇరాన్‌ వైద్యులు డాక్టర్‌ జావద్‌ సమన్‌ స్పష్టం చేశారు. మెథనాల్‌ను వాసన చూడటం, తాగడం చేయరాదని ఇది శరీర భాగాలపై దుష్ర్పభావం చూపడమే కాకుండా మెదడును ధ్వంసం చేస్తుందని వ్యక్తులు కోమాలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక మహమ్మారి వ్యాప్తిపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కాకపోవడంతోనే పెద్దసంఖ్యలో​ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇరాన్‌ అధికార యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చదవండి: లాక్‌డౌన్‌: బయటికొస్తే కాల్చిపడేస్తా

వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని, ఇక కరోనా కాకుండా ఇతర ప్రమాదాలూ పొంచిఉన్నాయనే అవగాహనా ప్రజల్లో కొరవడిందని క్లినికల్‌ టాక్సికాలజిస్ట్‌ డాక్టర్‌ నట్‌ ఎరిక్‌ హదా అన్నారు. మెథనాల్‌ను సేవించడం మరింత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఇరాన్‌లో ప్రస్తుతం అత్యధికులు జ్వరం, దగ్గుతో బాధపడుతుండగా వీరిలో పలువురికి రెండు మూడు వారాల్లో ఆయా లక్షణాల నుంచి కోలుకుంటుండగా, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారిలో కరోనా సోకితే న్యుమోనియా వంటి తీవ్ర వ్యాధులతో పాటు మరణాలు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా కలకలంతో ఇరాన్‌ అంతటా లాక్‌డౌన్‌ నెలకొన్న క్రమంలో 8 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇరాన్‌లో ఇప్పటివరకూ 29,000కుపైగా కరోనా వైరస్‌ కేసులు నిర్ధారణ కాగా, 2200 మంది మరణించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా