ప్రముఖ చెఫ్‌ ఆత్మహత్య

8 Jun, 2018 19:48 IST|Sakshi

పారిస్‌ :  ప్రముఖ చెఫ్‌ ఆంథోని బుర్డేన్‌ పారిస్‌లో ఆత్మహత్య  చేసుకున్నారు. ఓ కార్యక్రమ షూటింగ్‌ కోసం పారిస్‌కు వెళ్లిన ఆంథోని శుక్రవారం హోటల్లోని తన గది ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అమెరికాకు చెందిన ఆంథోని వంటల తయారీలో, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సాధారణ జనాలే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఆంథోని వంటకాలను అమితంగా ఇష్టపడుతారు. ప్రస్తుతం ఆంథోని ప్రముఖ న్యూస్‌ చానల్‌ సీఎన్‌ఎన్‌ నిర్వహిస్తున్న పార్ట్స్‌ అన్‌నోన్‌ వంటల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని వంటకాలను ఈ కార్యక్రమంలో పరిచయం చేస్తున్నారు. ఈ షో చిత్రీకరణ కోసం పారిస్‌ వెళ్లిన ఆంథోని హోటల్‌లో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆంథోని మరణంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

ఆంథోని తినని ఆహారం అంటూ ఏదీ లేదు. ప్రపంచంలోని దాదాపు అన్ని రకాల వంటకాలను రుచి చూసిన వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పారు. రుచికరమైన ఆహారంతోపాటు.. చెత్త ఫుడ్ కూడా తిన్న వ్యక్తిని నేనే అంటారు ఆయన. కొద్ది రోజుల ముందే పార్ట్స్‌ అన్‌నోన్‌కు సంబంధించి హౌస్‌ ఆఫ్‌ రైజింగ్‌ సన్‌ పేరుతో ఓ పాటను విడుదల చేశారు. దీనికి విశేష స్పందన వచ్చింది. ఆంథోని వంటలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతడు వంటలపై పుస్తకాలు రాయడంతో పాటు పలు టీవీ షోలు నిర్వహించారు. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది భద్రత కోసం కూడా ఆయన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎన్‌ఎన్‌లో ఆంథోని నిర్వహిస్తున్న పార్ట్‌ అన్‌నోన్‌ 2013లో ప్రముఖ పీబాడీ అవార్డు సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు