వివాదాస్పదం : అతన్ని కాల్చిపడేస్తాం..!

12 Jun, 2018 19:35 IST|Sakshi
అతుల్‌ కొచ్చర్‌

దుబాయ్‌ : అనుచిత, అనాలోచిత ట్వీట్లతో మత విద్వేషాలను రెచ్చగొట్టి విమర్శల పాలవుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా, ఇక్కడి జేడబ్ల్యూ మారియట్‌ మార్కిస్‌ హోటల్‌లో చీఫ్‌ చెఫ్‌గా పని చేస్తున్న భారత సంతతి వ్యక్తి ఆ కోవలోకి చేరారు. బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ‘కరుడుగట్టిన హిందూత్వవాదులు తీవ్రవాదుల’ని పేర్కొన్నట్లు ఖలీజ్‌ టైమ్స్‌ మంగళవారం ప్రచురించింది. 

దీనిపై స్పందించిన చెఫ్‌ అతుల్‌ కొచ్చర్‌.. ‘ఇది చాలా దురదృష్టకరం. మీరు హిందూత్వ వాదులను కించపరుస్తున్నారు. రెండు వేల ఏళ్లక్రితం నుంచి తీవ్రవాద భావజాలం వ్యాప్తి చేస్తున్న ఇస్లాం నుంచే హిందువులు తీవ్రవాదం నేర్చుకున్నార’ని ట్వీట్‌ చేసి దుమారం రేపారు. తీవ్ర విమర్శలు రావడంతో ఆయన తన ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. పెద్ద పొరబాటు దొర్లిందని క్షమాపణలు కోరారు. సరి చూసుకోకుండా ఇస్లాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నాని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

1400 ఏళ్ల నుంచి ఇస్లాం మతం ఉనికిలో ఉందనీ, కానీ అపరిపక్వంగా ఆలోచించి 2 వేల ఏళ్ల క్రితమని పేర్కొనడం పట్ల క్షమాపణలు కోరాడు. అయితే, హోటల్‌ యాజమాన్యం ఈ ట్వీట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అది కొచ్చర్‌ వ్యక్తిగత వ్యవహారమని ట్వీట్‌ చేసింది. దీనిపై స్పందించిన ఓ ట్విటరాటీ కొచ్చర్‌ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా, కొచ్చర్‌ ట్వీట్‌పై మండిపడిన కొందరు.. ‘అతడిని కాల్చిపడేస్తామని’ హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు