న్యూజిలాండ్‌ నరమేధంలో భార్యను కోల్పోయిన ఓ భర్త ఆవేదన

20 Mar, 2019 14:00 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌ : బంగ్లాదేశ్‌కు చెందిన హుస్నా తన 19 ఏట ఫరీద్‌ అహ్మద్‌ను వివాహం చేసుకుని తొలిసారి న్యూజిలాండ్‌ గడ్డ మీద అడుగు పెట్టింది. గత పాతికేళ్లుగా వారిద్దరు ఎంతో అన్యోనంగా జీవిస్తూ.. ప్రేమ, సంతోషం అనే పునాదుల మీద ఓ అందమైన పొదరింటిని నిర్మించుకున్నారు. మాతృ దేశాన్ని విడిచి.. న్యూజిలాండ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి దాన్నే తన సొంత ఇంటిగా భావించి.. ప్రేమించింది హుస్నా. ఆర్నెళ్లు గడిచేలోపే ఇంగ్లీష్‌ నేర్చుకుంది. కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంది. భర్తకు అన్ని వేళలా చేదోడువాదోడుగా నిలుస్తూ.. కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేది. ఫరీద్‌ ఇంట్లోనే హోమియోపతి మందుల దుకాణాన్ని నడుపుతుండేవాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. వారి అన్యోన్యతను చూసి విధికి సైతం కన్ను కుట్టింది.

అందుకే ఉగ్రదాడి రూపంలో వారి పాతికేళ్ల దాంపత్య జీవితాన్ని ముక్కలు చేసింది. ఎప్పటిలానే దైవ ప్రార్థనల నిమిత్తం మసీదుకెళ్లిన హుస్నాను మరణం ఉన్మాది రూపంలో వెంటాడింది. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం పూట న్యూజిలాండ్‌లోని మసీదుల్లో నరమేధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత వారం జరిగిన ఈ దారుణ సంఘటనలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. ఇలా మరణించిన వారిలో ఫరీద్‌ భార్య హుస్నా కూడా ఉన్నారు. ప్రార్థనల నిమిత్తం మసీదుకు వెళ్లినప్పుడు.. జరిగిన నరమేధంలో ఉగ్రవాది హుస్నాను ఫుట్‌పాత్‌ మీదనే కాల్చేశాడు. గతంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా వీల్‌ చైర్‌కే పరిమితమైన ఫరీద్‌ మసీదులో కాకుండా బయట ఉండే చిన్న గదిలో ప్రార్థనలు చేసుకుంటుండటం వల్ల ఈ దారుణం నుంచి తప్పించుకోగలిగాడు.

పేలుళ్ల శబ్దం వినిపడగానే సంఘటనా స్థలానికి వచ్చిన ఫరీద్‌కు అతని స్నేహితులు, ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు కనిపించాయి. కొందరు గాయాలతో బాధపడుతుండగా.. మరి కొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. వారిలో హుస్నా కూడా ఉన్నారు. జరిగిన దారుణం అర్థం కావడానికి కాస్త సమయం పట్టింది ఫరీద్‌కు. ఈ లోపు ఒక స్త్రీ వచ్చి.. ‘మీ భార్య ఇక ఎన్నటికి తిరిగి రారు.  మీరు రాత్రంతా ఇక్కడే వేచి ఉండటం వల్ల ఎటువంటి లాభం లేదు. ఇంటికి వెళ్లండి’ అని చెప్పింది. ఆ మాట వినగానే మూగ బోయాడు ఫరీద్‌. తన ప్రపంచమే కుప్పకూలిపోయిందంటూ విలపించాడు. (‘క్షమించండి.. మేము అలాంటి వాళ్లం కాదు’)

జరిగిన దారుణం గురించి ఫరీద్‌ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు హుస్నా మాటలు, నవ్వులతో కిలకిలలాడే నా ఇళ్లు ఈ రోజు మూగబోయింది. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని నేను క్షమిస్తున్నాను. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి, అతనిలానే ఆలోచించే అతని స్నేహితులకు నేనిచ్చే సందేశం ఇదే.​ ఇప్పటికి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని కౌగిలించుకుని.. మీ ముఖంలోకి చూస్తూ.. నా మనస్పూర్తిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేను ఇప్పటికి.. ఎప్పటికి మిమ్మల్ని ద్వేషించను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

ఇక తన భార్య గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నాకు తల్లి, తండ్రి, నేస్తం. ఇతరుల మేలు కోరే వ్యక్తి తను. వేరొకరి జీవితాన్ని కాపాడ్డం కోసం ఆమె చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది’ అంటూ భార్యను తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యాడు ఫరీద్‌. ఈ నరమేధానికి పాల్పడిన వారిలో ఒకరిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెటంన్‌ టారంట్‌(28)గా గుర్తించారు పోలీసులు.

(చదవండి : ‘అతని పేరును ఎవరూ పలకరాదు)

మరిన్ని వార్తలు