ఎఫ్‌ఏటీఎఫ్‌ ‘గ్రే లిస్ట్‌’లో పాక్‌

29 Jun, 2018 02:25 IST|Sakshi

అంతర్జాతీయంగా మసకబారనున్న ప్రతిష్ట

విదేశీ ఆర్థిక సాయం, రుణ పరపతిపై ప్రభావం

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) పాక్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీని ఫలితంగా ప్రపంచ దేశాల్లో ఆ దేశ ప్రతిష్ట దెబ్బతినడంతోపాటు విదేశీ ఆర్థిక సాయం నిలిచిపోనుంది. బుధవారం పారిస్‌లో జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి హాజరైన పాక్‌ ఆర్థిక మంత్రి షంషాద్‌ అక్తర్‌.. తమ దేశం నుంచి ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న జమాత్‌–ఉద్‌– దవా సంస్థ అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ సహా ఉగ్రమూకలకు నిధులు అందకుండా చేయటానికి వచ్చే 15 నెలల్లో అమలు చేయనున్న 26 అంశాల కార్యాచరణ ప్రణాళికను వివరించారు.

దీనిపై చర్చించిన ఎఫ్‌ఏటీఎఫ్‌..పాక్‌ పేరును గ్రే జాబితాలో ఉంచనున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ నిర్ణయం ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. దీనిపై పాక్‌ స్పందిస్తూ.. ‘ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం మాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఇది రాజకీయ పరమైన నిర్ణయం. ఉగ్రవాదంపై పోరులో పాక్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదు. త్వరలోనే గ్రే జాబితా నుంచి బయటపడతాం. గతంలోనూ ఇలా జరిగింది’ అని పేర్కొంది. 1989లో ఏర్పాటైన ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రూపులో 37 దేశాలున్నాయి. మనీ లాండరింగ్‌ నిరోధానికి, ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయటానికి ఇది కృషి చేస్తుంది. కాగా, గ్రే లిస్ట్‌లో ఇప్పటికే ఇథియోపియా, ఇరాక్, యెమెన్, సెర్బియా, సిరియా, శ్రీలంక, ట్రినిడాడ్‌ టొబాగో, ట్యునీసియా, వనౌటు దేశాలున్నాయి.

గ్రే లిస్ట్‌లో ఉంటే ఏమవుతుంది?
ఇప్పటికే పాక్‌ పలుకుబడి అంతర్జాతీయంగా మసకబారింది. ఉగ్రవాదులతో సంబంధ మున్న దేశంగా ముద్రపడితే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. అక్కడ పెట్టుబ డులు పెట్టడానికి, కంపెనీలు నెలకొల్పేందుకు విదేశీ సంస్థలు సంశయిస్తాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు పుట్టడం కష్టం. స్టాండర్డ్‌ చార్టెర్డ్‌ బ్యాంక్‌ వంటి విదేశీ బ్యాంకులు దేశం నుంచి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అదే బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే ప్రభుత్వాలు, సంస్థలు, కంపెనీలు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వవు.

మరిన్ని వార్తలు