మియాఖాన్‌.. రియల్‌ హీరో

7 Dec, 2019 13:34 IST|Sakshi

తమ పిల్లలకు ఆస్తులు కాదు జ్ఞానాన్ని సంపాదించి ఇవ్వాలని భావించాడు ఆ తండ్రి. దానికోసం వారికి నాణ్యమైన విద్యను అందిచాలనుకున్నాడు. ఇంట్లో పూట గడవడానికి కష్టంగా ఉన్నప్పటికీ.. తను కూతుళ్ల చదవు కోసం ప్రతిరోజు 12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాడు. 

మియాఖాన్‌.. ఆఫ్గనిస్తాన్‌లోని శరణ్‌ ప్రాంత నివాసి. ఆయనకు ఓ కొడుకు, ముగ్గరు కూతుళ్లు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అయినప్పటికీ కూతుళ్లను చదివించాలనుకున్నాడు. కానీ సమీప ప్రాంంతంలో పాఠశాలలు లేవు. తమ నివాసానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాఠశాలలో ముగ్గురు కూతుళ్లను జాయిన్‌ చేయించాడు.  అయితే అక్కడికి వెళ్లేందుకు బస్సు సదుపాయం కూడా లేకపోవడంతో ప్రతి రోజులు ఆయన తన మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్తున్నాడు. కూతుళ్లను పాఠశాలలో వదిలి సాయంత్రం వరకు అక్కడే ఉంటాడు. పాఠశాల ముగియగానే కూతుళ్లను తీసుకొని ఇంటికి వస్తాడు. ఇదే ఆయన దినచర్య. తాను ఎలాగో చదువుకోలేదని, తన కూతుళ్లను పెద్ద చదవులు చదివిస్తానని మియాఖాన్‌ చెబుతున్నాడు.

‘నేను చదువుకోలేదు. కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. నా కూతుళ్లకు మంచి విద్యను అందించడం కోసం నేను పని కూడా మానేశా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నా కూతుళ్లను చదివిస్తా. వాళ్లను డాక్టర్లుగా చూడాలని నా కోరిక. మా ప్రాంతంలో మహిళా డాకర్లు లేరు. నా కూతుళ్లు డాక్టర్లై మా ఏరియా ప్రజలకు సేవచేస్తే చూడాలని ఉంది. అదే నా లక్ష్యం. నా కూతుళ్లను కొడుకుల్లా పెంచి డాక్టర్లను చేయిస్తా’  అని మియాఖాన్‌ పేర్కొన్నారు. 

మియాఖాన్‌ కూతుళ్లలో ఒకరైన రోజీ మాట్లాడుతూ.. తాము చదవుకుంటుంన్నందుకు సంతోషంగా ఉందన్నారు. నాన్నా లేదా అన్నయ్య ప్రతి రోజు తమను పాఠశాలకు తీసుకెళ్తారని, స్కూల్‌ ముగిసే వరకు అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకొస్తారని చెప్పారు. కాగా, మియాఖాన్‌ ముగ్గురు కూతుళ్లలో ఒకరు ఐదో తరగతి, మిగతా ఇద్దరు ఆరో తరగతి చదువుతున్నారు. 

కాగా, మియాఖాన్‌ స్టోర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ ఆ తడ్రిని చూస్తే గర్వంగా ఉంది’,. మియా ఖాన్‌.. రియల్‌ హీరో’. ఆ ముగ్గరు పిల్లలు అదృష్టవంతులు, గొప్ప తండ్రి దొరికాడు’ , ‘ ప్రతి తండ్రి మియాఖాన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి’అంటూ నెటిజన్లు మియాఖాన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు