భారత పైలట్‌ను విడిచిపెట్టండి : ఫాతిమా భుట్టో

28 Feb, 2019 10:47 IST|Sakshi

ఇమ్రాన్‌ ఖాన్‌కు పాక్‌ మాజీ ప్రధాని మనుమరాలి విఙ్ఞప్తి

ఇస్లామాబాద్‌ :  పాకిస్తాన్‌ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ను విడుదల చేయాలని పాక్‌ మాజీ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టో మనుమరాలు, పాకిస్తానీ రచయిత్రి ఫాతిమా భుట్టో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్‌ దాడులను తిప్పి కొట్టే క్రమంలో విక్రమ్‌ అభినందన్‌ అనే భారత పైలట్‌ ఆ దేశ సైన్యానికి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను హింసించినట్లుగా ఉన్న వీడియోలు బహిర్గతం కావడంతో యావత్‌ భారతావని ఆందోళనలో మునిగిపోయింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తనతో పాటు పాకిస్తానీ యువత మొత్తం అభినందన్‌ను క్షేమంగా భారత్‌ పంపించాలని కోరుకుంటున్నారంటూ ఫాతిమా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌లో ఆమె కథనం రాసుకొచ్చారు.(ఎవరీ విక్రమ్ అభినందన్‌?)

అనాథలుగా మారాలనుకోవడం లేదు...
‘శాంతి, మానవత్వం, నిబంధనల పట్ల నిబద్ధత కనబరిచి భారత పైలట్‌ను విడుదల చేయండి. మా జీవితంలో గరిష్ట  కాలమంతా యుద్ధ వాతావరణంలోనే గడిపాము. పాకిస్తాన్‌ సైనికులు గానీ భారత సైన్యం గానీ చనిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఉపఖండం అనాథలుగా మిగిలిపోవాలని అనుకోవడం లేదు కూడా. మా తరం పాకీస్తానీలు మాట్లాడే హక్కు కోసం నిర్భయంగా పోరాడారు. అందరినీ క్షేమంగా ఉంచే శాంతి కోసం మా గళం వినిపించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ సైనిక పాలన, ఉగ్రవాదం, ఇతర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్న కారణంగా మతదురభిమానానికి, యుద్ధానికి మేము వ్యతిరేకం. శాంతిని దూరం చేసే ఈ అంశాలను మేము అస్సలు సహించలేం’ అని పాక్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో మేనకోడలు ఫాతిమా పేర్కొన్నారు.  

ఇక ప్రపంచ వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి #saynotowar అనే హ్యాష్‌ ట్యాగ్‌.. మొదట పాకిస్తాన్‌లో ట్రెండ్‌ అయిన విషయాన్ని ప్రస్తావించిన ఫాతిమా... ‘ పొరుగదేశంతో మా దేశం శాంతియుతంగా ఉన్న సందర్భాన్ని నేనెప్పుడూ చూడలేదు. కానీ ప్రస్తుతం నాలాగే చాలా మంది భారత్‌- పాక్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తత తొలగిపోవాలని ఆశిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు