విమానంలో పొగలు.. అత్యవసర ల్యాండింగ్

19 Sep, 2016 08:48 IST|Sakshi
విమానంలో పొగలు.. అత్యవసర ల్యాండింగ్

అది 223 మంది ప్రయాణికులతో వెళ్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం. ఉన్నట్టుండి అందులోంచి పొగలు వచ్చాయి. దాంతో విమానాన్ని వెనక్కి తిప్పి, అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ పొగలు ఎక్కడి నుంచి వచ్చాయంటే.. కాఫీ మిషన్ నుంచి!! అవును, అది బాగా వేడెక్కడంతో దాంట్లోంచి పొగలు వచ్చాయి. పైగా ఆ మిషన్‌ను ఎవరూ ఆపలేకపోయారు. అందుకే విమానాన్ని దించాల్సి వచ్చింది. వర్జీనియాలోని వాషింగ్టన్‌ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మ్యునిక్ బయల్దేరిన ఎ330-300 విమానం సిడ్నీకి నైరుతి దిశగా 70 మైళ్ల దూరంలో ఉండగా విమానంలో ఏదో కాలుతున్న వాసన వచ్చినట్లు ఓ ప్రయాణికుడు సిబ్బందికి తెలిపారు. దాంతో వాళ్లు వెంటనే గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

దాంతో విమానాన్ని తక్షణం బోస్టన్ వైపు తిప్పి, 70 నిమిషాల తర్వాత దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తర్వాత పొగ ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే.. కాఫీ మిషన్ కారణంగా అని తెలిసింది. విమానాన్ని 16 గంటల పాటు బోస్టన్‌లోనే ఉంచేసి, క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత 18 గంటలు ఆలస్యంగా మ్యునిక్ తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు