ఐదు నిమిషాల్లోనే కరోనా టెస్ట్‌!

29 Mar, 2020 06:39 IST|Sakshi

అబాట్‌ ల్యాబ్స్‌ ఆవిష్కరణ

అనుమతులిచ్చిన యూఎస్‌ఎఫ్‌డీఏ

కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్‌ వ్యాధిని నిర్ధారించే ‘‘రోగ నిర్ధారణ పరీక్ష కిట్‌’’ను ఆవిష్కరించినట్లు అబాట్‌ ల్యాబొరేటరీస్‌ శుక్రవారం ప్రకటించింది. ID NOW COVID&19 అని పిలిచే ఈ పరీక్షతో అనుమానిత వ్యక్తులకు వ్యాధి సోకిందా లేదా అనే విషయాన్ని 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. తాజాగా అమెరికా ఫెడరల్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) దీనికి అనుమతులిచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ పరీక్షలను అన్ని ఫిజీషియన్స్‌ ఆఫీసులు, అత్యవసర సంరక్షణ క్లినిక్‌లు, హాస్పిటల్‌లో సులభంగా జరపవచ్చని పేర్కొంది.

ప్రపంచదేశాలను కబళిస్తున్న కరోనా వైరస్‌ అమెరికాలో తీవ్రరూపం దాల్చింది. ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానికులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. వేలాదిగా వస్తున్న ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయలేక  వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అబాట్‌ ల్యాబొరే టరీస్‌ కిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ తన అత్యవసర అధికారాలను వినియోగించి ఈ కిట్‌కు వేగంగా అనుమతులిచ్చింది.

సోమవారం నుంచి అందుబా టులోకి! వచ్చే వారం సోమవారం నుంచి పరీక్షలను ప్రారంభించే యోచనలో ఉన్నామని, రోజుకు 50 వేల వరకు పరీక్షలను జరిపే అవకాశం ఉంటుందని అబాట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి ID NOW COVID&19 పరీక్ష అమెరికాకు మాత్రమే పరిమితమవుతుంది. అవసరాన్ని బట్టి భారత్‌ సహా ఇతర దేశాలకు అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. ‘‘ఇది అత్యుత్తమైన ముందడుగు. 5 నిమిషాల్లోనే పాజిటివ్‌ ఫలితాన్ని, 13 నిమిషాల్లో నెగిటివ్‌ ఫలితాన్ని పొందవచ్చు. ప్రస్తుత పరీక్షలకు 1–2 రోజుల సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువే అవుతోంది. మా కిట్‌తో ఈ సమస్య తగ్గుతుంది’’ అని అబాట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ ఫ్రీల్స్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు