రియల్‌ క్యాచ్‌.. రియల్‌ హీరో..

17 Jan, 2018 12:20 IST|Sakshi

ఓ వైపు ఎగసి పడుతున్న మంటలు, మరో వైపు పై అంతస్తు నుంచి వేగంగా కిందకు వస్తున్న ఓ చిన్నారి. క్రికెట్‌ మ్యాచ్ లో క్యాచ్‌ మిస్సయితే కనీసం బ్యాట్స్‌ మెన్‌ కయినా లైఫ్ వచ్చిందంటాం. కానీ నిజజీవితంలో ఓ అగ్నిమాపక సభ్యుడికి వచ్చిన క్యాచ్‌ మిస్సయినా, లేక అదుపుతప్పి మంటల్లో పడినా ఒకటి కాదు రెండు ప్రాణాలు పోవాల్సిందే. రియల్‌ క్యాచ్‌ పట్టి చిన్నారి ప్రాణాలను కాపాడి రియల్‌ హీరోగా నెటిజన్లతో శభాష్‌ అనిపించుకున్నారు కెప్టెన్‌ స్కాట్ స్ట్రాప్.

విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్థులను కాపాడటమే ధ్యేయంగా పని చేస్తారు అగ్నిమాపక సిబ్బంది. అవసరం వస్తే ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే వారిలో అగ్నిమాపక విభాగంలో పని చేసేవారు ఎప్పుడూ ముందుంటారు. ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది చూపించే ధైర్య సాహసాలే ఎంతో మందికి పునర్జన్మనిచ్చాయి. అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలను ఓ కెప్టెన్‌ కాపాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాలు.. అమెరికాలోని జార్జియాలో జనవరి 3న భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ఓ వైపు అగ్నికీలలను అదుపు చేస్తూనే మరో వైపు మంటల్లో ఇరుక్కున్న వారిని రక్షించడానికి సహాయకచర్యలు ముమ్మరం చేశారు. దట్టమైన మంటలు దాదాపు ఇంటిని చుట్టుముట్టడంతో అందులో చిక్కుకున్న వారిని నిచ్చెన సహాయంతో బిల్డింగ్‌ పై నుంచి కిందకు దిగడానికి ఏర్పాట్లు చేశారు. ఓ డజను మంది బిల్డింగ్ పై నుంచి కిందకు దిగడానికి సిద్దంగా ఉన్నారు. సరిగ్గా అదేసమయంలో మంటల తీవ్రత ఎక్కువవ్వడంతో పై నుంచి దిగుతున్న వ్యక్తి ఓ చిన్నారిని కిందకు విసిరారు. వెంటనే అప్రమత్తమైన కెప్టెన్‌ స్కాట్ స్ట్రాప్ చిన్నారిని తన రెండు చేతులతో పట్టుకొన్నారు. పక్కనే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి రెండు చేతుల్లో చిన్నారిని ఒడిసిపట్టుకొని పరిగెత్తుకుంటూ సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు.

ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్ అయింది. వీడియో చూసిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. 'కొన్ని సందర్భాల్లో ఫుట్‌ బాల్‌ను క్యాచ్‌ పట్టుకున్నట్టు చిన్నారులను పట్టుకోవాల్సి వస్తుంది. బాల్కనీలపై నుంచి చిన్నారులను కిందకు వేసే సమయంలో తమ పక్కన మంటలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా కేవలం చిన్నారులను పట్టుకోవడంపైనే దృష్టి ఉంచాలి'  అని అగ్నిమాపక సిబ్బంది సభ్యులు ఒకరు తెలిపారు. జార్జియాలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారితో పాటూ 12 మంది ప్రాణాలను కాపాడగలిగామని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది.

>
మరిన్ని వార్తలు