కార్లో తేలినట్టుందే...

7 Aug, 2016 03:17 IST|Sakshi
కార్లో తేలినట్టుందే...

గాల్లో కాదు నీళ్లల్లో! ఏకంగా సముద్రంలోనే తేలే సొరంగం ఇది. ఆ సొరంగంలో కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించవచ్చు... కార్లో తేలిపోవచ్చు. మీరు ఫై లవోవర్లు చూసుంటారు. సస్పెన్షన్ బ్రిడ్జిలు, కొండల్ని తొలిచి కట్టిన టన్నెల్స్‌నీ చూసుంటారు. కానీ ఫొటోలో కనిపిస్తోందే.. అది అండర్‌వాటర్ బ్రిడ్జి. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే బ్రిడ్జి కూడా. నార్వే దేశంలో కట్టనున్నారు ఈ హైటెక్ బ్రిడ్జీని. భలే అందంగా ఉంటుందీ దేశ సముద్రతీర ప్రాంతం! తీరం వెంబడి కొండలు, కోనలు.. బ్యాక్‌వాటర్స్ అబ్బో అదరహో అనుకోండి! అయితే ఓ చిక్కుంది. ఈ తీరం వెంబడి ఒక పక్క నుంచి ఇంకోపక్కకు వెళ్లాలంటే బోలెడు కష్టం. కొంతదూరం రోడ్డుపై మరికొంత దూరం పెద్దపెద్ద నౌకలపై మళ్లీ కొంత దూరం రోడ్డుపై ప్రయాణించాలి.

ఆ దాందేముంది.. ఎక్కడికక్కడ బ్రిడ్జీలు కట్టేయవచ్చు కదా అనుకోవద్దు. అక్కడున్న నేల స్వభావానికీ, బ్యాక్‌వాటర్ చానెళ్ల వెడల్పుకూ బ్రిడ్జీలు కట్టడం అసాధ్యమని తేల్చేశారు. దీంతో నార్వే పబ్లిక్ రోడ్స్ కంపెనీ ఈ అండర్‌వాటర్ సస్పెన్షన్ సొరంగం ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సముద్రంలో దాదాపు వంద అడుగుల లోతులో ఉండే ఈ సొరంగాలను బలమైన సిమెంట్ దిమ్మెల సాయంతో వేలాడదీస్తారు. ఫలితంగా నీటిపైన ఈ దిమ్మెల మధ్యలో నౌకలు, ఫెర్రీలు మామూలుగా ప్రయాణించవచ్చునన్నమాట. కొండలకు రెండు పక్కల బలమైన ఉక్కుతాళ్లతో సొరంగాలను అనుసంధానిస్తారు. దాదాపు 4000 అడుగుల పొడవైన సొరంగాన్ని కట్టేందుకు 2500 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందట. అన్నీ సవ్యంగా సాగితే మరో 19 ఏళ్లకు నిర్మాణం పూర్తవుతుందని అంచనా!
 
 

మరిన్ని వార్తలు