సహచర్యం కోసం వేల మైళ్ల ప్రయాణం..!

16 Mar, 2016 18:04 IST|Sakshi
సహచర్యం కోసం వేల మైళ్ల ప్రయాణం..!

వాషింగ్టన్: ఇతర జంతువులకు విరుద్ధంగా పాండాలు వ్యవహరించడాన్ని తాజా అధ్యయనాల్లో కనుగొన్నారు. సాధారణంగా జంతువుల్లో పురుషజాతి జంతువులు సహచర్యం కోసం స్త్రీ జాతి జంతువుల వెంట పడటం చూస్తామని, అయితే పాండాల విషయంలో అది విరుధ్దంగా ఉందని పరిశోధకులు అంటున్నారు. యవ్వన దశలోకి సమీపిస్తున్న సమయంలో ఆడ పాండాలు మగ పాండాల కోసం వేల మైళ్ల దూరాన్ని సైతం లెక్కచేయకుండా ప్రయాణిస్తాయని కొత్త అధ్యయనాల్లో కనుగొన్నారు.

అమెరికాలోని మిచిగన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన అధ్యయనకారులు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా ఐదు పాండాల కదలికలను ట్రాక్ చేశారు. ఆడ పాండాలు ఆయా కాలాల్లో  మగ పాండాలతో సంభోగం కోసం నిరీక్షిస్తూ ఉండటాన్ని ఇంతకు ముందే కొన్ని అధ్యయనాలద్వారా  తెలుసుకున్నా...  మైళ్ళ దూరాన్ని సైతం లెక్కచేయకుండా ప్రయాణిస్తుండటాన్ని తాజా పరిశోధనల ద్వారా కనుగొన్నారు. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగిడే సమయంలో ఆడ పాండాలు... సంభోగం కోసం మైళ్ళదూరం ప్రయాణించి, తిరిగి పిల్లలకు జన్మనిచ్చే సమయానికి సొంత స్థానానికి చేరుకుంటాయని, పుట్టిన పిల్లలను అక్కడే పెంచుతాయని కూడ అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు.  

ముఖ్యంగా క్షీరదాల్లో ఆడ జంతువులు సంభోగంకోసం మగవాటి కోసం వెతకడం చాలా అరుదని, అందులోనూ ఎలుగుబంటి జాతికి చెందిన ఏ జంతువులోనూ ఇటువంటి లక్షణాలు ఇప్పటివరకూ కనిపించలేదని, ఇది ఎంతో ఆసక్తికరమైన ప్రవర్తన అని మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన థామస్ కొన్నోర్ చెప్తున్నారు.

 

చైనాలోని క్వియోంగ్లై, క్విన్ లింగ్ అనే రెండు పర్వత శ్రేణుల్లో నివసించే పాండాల్లో ఇటువంటి లక్షణాలను అధ్యయనకారులు కనుగొన్నారు. ఈ పాండాలను జైంట్ పాండాలని పిలుస్తారని, ఈ జాతిలో ఇంకా ఎన్నో విచిత్రమైన, అరుదైన లక్షణాలు కనిపించే అవకాశం ఉందని కొన్నోర్ తెలిపారు. ఈ తాజా పరిశోధనలను ఇంటిగ్రేటెడ్ జూవాలజీ జర్నల్ లో ప్రచురించారు.
 

మరిన్ని వార్తలు