బర్త్ కంట్రోల్ పిల్ కు బదులుగా ఫెట్రిలిటీ యాప్...!

14 Apr, 2016 16:03 IST|Sakshi

లండన్ః గర్భనిరోధక మాత్రలకు బదులుగా వినియోగించే ఓ కొత్త యాప్ ను వైద్య పరిశోధకులు అందుబాటులోకి తెచ్చారు. నేచురల్ సైకిల్స్ పేరున అందుబాటులోకి తెచ్చిన ఈ  కొత్త యాండ్రాయిడ్ యాప్ ఆధారంగా సంతానోత్సత్తి సమయాన్ని తెలుసుకొని, ముందు జాగ్రత్తలతో  అవాంఛిత గర్భానికి దూరం కావొచ్చని పరిశోధకులు చెప్తున్నారు.

మహిళల్లో సంతానోత్సత్తి సమయాన్ని గుర్తించేందుకు పరిశోధకులు కొత్త యాప్ ను సృష్టించారు. బర్త్ కంట్రోల్ పిల్ ను వాడేందుకు బదులుగా ఈ అనువర్తనం ద్వారా మహిళల శరీరంలోని ఉష్ణోగ్రతనుబట్టి అండోత్పత్తి సమయాన్ని గుర్తించే అవకాశం ఉంటుందని  వైద్య పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. నేచురల్ సైకిల్స్ యాప్ ను సృష్టించి రసాయనాలకు దూరంగా సహజ గర్భనిరోధావకాశాన్ని కల్పించే పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ కొత్త అనువర్తనం వినియోగించి ఇకపై మహిళల్లో ఇతర సమస్యలను తెచ్చిపెట్టే  పిల్స్ కు దూరం కావొచ్చునని చెప్తున్నారు. 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలపై పరిశోధకులు స్వీడన్ లో ఓ క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. పెర్ట్ ఇండెక్స్ పద్ధతిలో యాప్ ను పరీక్షించిన పరిశోధకులు గర్భనిరోధక మాత్రలను పోలిన ఫలితాలే ఉండటాన్ని గుర్తించారు. గర్భనిరోధక మాత్రలు క్రమ పద్ధతిలో వాడిన వెయ్యిమంది మహిళల్లో  సంవత్సరంలో 0.3 శాతం అనుకోకుండా గర్భం దాల్చే అవకాశం కనిపిస్తే... నేచురల్ సైకిల్ సిస్టమ్ ద్వారా  కూడా 0.5 శాతం మాత్రమే ప్రమాదం ఉన్నట్లు కనుగొన్న పరిశోధకులు తమ అధ్యయనాలను యూరోపియన్ జర్నల్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అండ్ రీ ప్రొడక్టివ్ హెల్త్ కేర్ లో ప్రచురించారు.

ఆరోగ్యంకోసం అనేక రకాలుగా ఇటీవల మొబైల్ టెక్నాలజీని వాడుతున్నారని యాప్ సృష్టికర్త ఎలీనా బెర్గ్లండ్ చెప్తున్నారు. కెమికల్స్ కు బదులుగా నేటి మహిళలు నేచురల్ సైకిల్స్ యాప్ ను వినియోగించి అవాంఛిత గర్భానికి దూరంకావచ్చంటున్నారు. అంతేకాక గర్భ నిరోధక మాత్రలవల్ల శరీరంలో వచ్చే అనేక రకాలైన హార్మోన్ సమస్యలను కూడ అధిగమించవచ్చని యాప్ సృష్టికర్తలు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు