ఈ చిన్న వ్యాయామంతో గుండెకు మేలు!

5 Aug, 2016 12:05 IST|Sakshi
ఈ చిన్న వ్యాయామంతో గుండెకు మేలు!

వాషింగ్టన్: ఏదైనా కొత్త పరిస్థితి ఎదురైనప్పుడు, ఓపిక లేకుండా.. అసహనంగా మారినప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు కొందరు తమ కాళ్లు, చేతులను వారికి తెలియకుండానే ఊపుతుండటం గమనిస్తూనే ఉంటాం. 'ఫిడ్జెటింగ్'గా పిలిచే ఈ అలవాటు పక్కనున్న వారిని కాస్త అసౌకర్యానికి గురిచేస్తున్నప్పటికీ.. పెద్ద వ్యాయామంగా పనిచేస్తుందని ఇటీవల పరిశోధకులు గుర్తించారు. కూర్చున్న చోటే కాసేపు పాదాలు, చేతులు కదిలించటం ద్వారా గుండె జబ్బులు దూరమౌతాయని వారు వెల్లడిస్తున్నారు.

కొన్ని గంటలపాటు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయటం, టీవీ చూడటం లాంటివి చేసే వారు కాసేపు పాదాలు ఊపటం ద్వారా రక్తప్రసరణ మెరుగుపడి.. గుండెకు మేలు చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరికి చెందిన న్యూట్రిషియన్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జామె పడిల్లా తెలిపారు. ఫిడ్జెటింగ్ ద్వారా కాళ్లకు రక్త ప్రసరణ పెరగటంతో గుండెకు సంబంధించిన పనితీరు మెరుగవుతుందని ఆయన వెల్లడించారు. అయితే.. కూర్చొని పనిచేసే వారు దీనినే వాకింగ్కు ప్రత్యామ్నాయంగా భావించడానికి వీలులేనప్పటికీ.. ఈ చిన్న వ్యాయామం గుండెకు సంబంధించిన జబ్బులను నియంత్రించడంతో తోడ్పడుతుందన్నారు.

 

మరిన్ని వార్తలు