ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఎఫైర్‌!

10 Oct, 2019 14:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆఫీస్‌ పని మీద మరో నగరానికి వెళ్లి బస్టాండ్‌ నుంచి అప్పుడే క్యాబ్‌లో ఇంటికి చేరుకుంది స్టిఫాని బర్టన్‌. ఇంట్లోని వరండాలోకి వచ్చి అలసటతో పక్కనున్న సోఫాపై భుజానున్న బ్యాగ్‌ను పడేసి హమ్మయ్య! అంటూ ఆ పక్కనే కూర్చుండి పోయింది. ఆఫీస్‌ పని మీద వెళ్లిన నగరంలో బస చేసిన హోటల్‌ గదిలో రాత్రిపూట బాయ్‌ ఫ్రెండ్‌తో గడిపిన మధుర స్మృతులు అప్పుడప్పుడే ఆమె మనోఫలకం మీది నుంచి మాయమవుతున్నాయి. ‘హౌ ఆర్‌ యూ స్టిఫానీ!’ అంటూ ఎదురుగా వచ్చి పలకరించిన భర్తను చూసి దిక్కున సోఫా నుంచి లేచిన స్టిఫానీ రెండు చేతులు చాచి, భర్తను కౌగలించుకొని ‘ఐ లవ్‌ యూ డార్లింగ్, ఐయామ్‌ ఫైన్‌’ అంటూ సమాధానం ఇచ్చింది. అప్పటికే గత రాత్రి స్మతులను పూర్తిగా మరచిపోయి రోజు వారి ఇంటి పనిలో పడిపోయింది స్టిఫానీ. 40 ఏళ్ల స్టిఫాని ఇంగ్లండ్‌లోని మాన్‌చెస్టర్‌లో తన న్యాయవాది భర్త మైకేల్, 14 ఏళ్ల కూతురుతో కలిసి ఉంటోంది.

18 నెలల క్రితం బాయ్‌ ఫ్రెండ్‌తో సెక్స్‌ బంధం ఏర్పడకముందు స్టిఫానీకి జీవితంలో ఏదో వెలితీగా ఉండేది. ఆఫీసు, ఇంటి పనితో సతమతమవుతూ వచ్చేది. ఎప్పుడు విశ్రాంతి కావాలనిపించేది. అది కుదరకపోవడంతో జీవితంపట్లనే విసుగనిపించేది. 18 నెలల నుంచి జీవితం కొత్తగా కనిపిస్తోంది. ఓ మధురానుభూతి ఇప్పుడు ఆమెను నడిపిస్తోంది. ఆఫీసు పనైనా, ఇంటి పనైనా ఆమెకు ఇప్పుడు ఏ మాత్రం విసుగనిపించడం లేదు. ఈ విషయాలను ఆమె నిర్భయంగా ‘సెక్స్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌’ పేరిట ‘ఫిమేల్‌’ మాగజైన్‌ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు.

స్టిఫానీలాగా భర్తకు తెలియకుండా పరపురుషుడితో సెక్స్‌ సంబంధాలు పెట్టుకున్నవారు ఇంగ్లండ్‌లో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరున్నారు. ఈ మహిళలు తమను కూడా మోసం చేస్తున్నారనే విషయం వారితో సెక్స్‌ జీవితాన్ని పంచుకుంటున్న పరపురుషుల్లో 47 శాతం మందికి తెలియదట. ఇక వివాహేతర సెక్స్‌ జీవితాన్ని ఇతరులలో పంచుకుంటున్న మహిళల భర్తల్లో దాదాపు 50 శాతం మందికి తమ భార్యల పట్ల కించిత్తు అనుమానాలు కూడా లేవట. అన్ని వయస్కుల మహిళల సెక్స్‌ అనుభవాలపై ‘ఫిమేల్‌’ పత్రిక ఇటీవల అధ్యయనం నిర్వహించగా దాదాపు వెయ్యి మంది మహిళలు తమ సెక్స్‌ జీవితాల గురించి క్షుణ్నంగా వివరించారు.

పరపురుషుడితో పడకసుఖం ఎంతో థ్రిల్లింగా ఉన్నా.. భర్తను వదిలి పెట్టాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని స్టిఫానీ తెలిపారు. అది తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. కుటుంబం కారణంగా తనకు సామాజిక జీవితం కూడా వచ్చిందని, వీటన్నింటిని వదులుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆమె తెలిపారు. ఇప్పటికీ తాను భర్తతోని వారానికి ఒక్కసారైనా సెక్స్‌లో పాల్గొంటానని, బయట తనకు దొరుకుతున్న సుఖాన్ని దృష్టిలో పెట్టుకొని భర్తకు ఎక్కువ సుఖం ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని స్టిఫాని వివరించారు. తన బాయ్‌ ఫ్రెండ్‌కు కూడా పెళ్లయిందని, ఆమె పట్ల తానేమీ అసూయపడడం లేదని చెప్పారు.

వివాహ బంధంలేని ఏ ఎఫైర్‌లోనైనా థ్రిల్లింగ్‌ ఉంటుందని ప్రముఖ సైకోథెరపిస్ట్‌ లూసీ బెరస్‌ఫోర్డ్‌ చెప్పారు. ఇంటి జీవితంలో మహిళలు తాము కొంత దోపిడీకి గురవుతున్నామని భావిస్తారని, ఇలాంటి ఎఫైర్‌ దొరికినప్పుడు తాము కోల్పోయింది దొరికినట్లు భావిస్తారని ఆయన చెప్పారు. పెళ్లి బంధంతో తాము నిర్లక్షానికి గురవుతున్నామని కూడా భార్యలు భావిస్తారని, అందుకనే పరపురుషులతో వారు ఎక్కువ ఆనందంగా ఉంటారని కూడా ఆయన చెప్పారు. మహిళల్లో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయని, భర్త పట్ల కోపం, ప్రతీకారం, ప్రస్తుత జీవితం పట్ల అసంతృప్తి, అసహనంతో పరపురుషులను ఆశ్రయిస్తారని బెరస్‌ఫోర్డ్‌ వివరించారు.

ఆఫీసు పనిమీద ఇతర ప్రాంతాలకు తాను వెళ్లాల్సి వస్తోందని, అలాంటి సందర్భాల్లో మగవారితో కలిసి పనిచేసినప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని, ఆ పరిచయాలు సెక్స్‌ సంబంధాలకు దారితీశాయని లండన్‌కు చెందిన 38 ఏళ్ల రాచెల్‌ మోర్గాన్‌ తెలిపారు. ఈ సంబంధాల కారణంగా తాను భర్త నుంచి విడిపోవాల్సి వచ్చిందని, అందుకు బాధేమీ లేదని ఆమె అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ రహస్య సెక్స్‌ కార్యకలాపాల గురించి వివరించారు. ఎక్కువ మంది తమకు భర్తలను వదిలేసే ఉద్దేశం లేదని చెప్పగా, దాదాపు అందరూ మహిళలు పరపురుషులతోనే సెక్స్‌ అనుభూతి బాగుందని చెప్పారు.

మరిన్ని వార్తలు