భగ్గుమన్న బార్సిలోనా, ఎటు చూసినా అగ్ని కీలలు

19 Oct, 2019 15:59 IST|Sakshi

బార్సిలోనా భగ్గుమంటోంది. కటాలోనియా వేర్పాటు వాదులకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన శుక్రవారం కాస్త ప్రజ్వరిల్లింది. ముసుగులు ధరించిన యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోడ్లపైన అగ్గిని రాజేసి అగ్ని కీలలను సష్టించారు. చెత్తా చెదారాన్ని మండే వస్తువులను పోగేసి తగులబెట్టారు. కొన్ని చోట్ల స్పానిష్‌ పోలీసులతో వీధి పోరాటాలకు కూడా దిగారు. కటాలోనియా స్వాతంత్య్రాన్ని కోరుతూ నినాదాలు చేశారు. కటాలోనియాలో గత ఐదు రోజులుగా దాదాపు 50 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇలా ఆందోళన నిర్వహిస్తున్నారు.

2017లో స్వతంత్య్ర రిఫరెండమ్‌ను ప్రకటించినందుకు తొమ్మిది మంది కటాలోనియా వేర్పాటు వాదులకు స్పానిష్‌ సుప్రీం కోర్టు గత సోమవారం జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఆ రోజు నుంచి ఆందోళనలకు దిగారు. గతంలో జమ్మూ కశ్మీర్‌కు ఉన్నట్లుగానే కొంత స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం కటాలోనియా. స్పానిష్‌ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 75 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారు సుదీర్ఘకాలంగా స్వానిష్‌ నుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు