-

చైనా వెలుపల కోవిడ్‌ మృతులు

2 Mar, 2020 04:00 IST|Sakshi

అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లో నమోదైన మరణాలు

బీజింగ్‌/వాషింగ్టన్‌: శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి చైనా వెలుపల కూడా ప్రాణాలను మింగేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లో తొలిసారిగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అమెరికా గడ్డపై 50 ఏళ్లు పైబడిన ఒక వ్యక్తి మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజలెవరూ  ఈ వైరస్‌ గురించి ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు అమెరికాలో 22 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో 15 మంది కోలుకున్నారు. మరోవైపు జపాన్‌ డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో వైరస్‌ సోకి పెర్త్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు మరణించడంతో ఆస్ట్రేలియాలో కూడా తొలి కోవిడ్‌ మరణం నమోదైంది. థాయ్‌లాండ్‌లో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 2,996కు చేరింది.

ఇరాన్‌లో మృతులు 54
మరోవైపు ఇరాన్‌లో కోవిడ్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ 54 మంది మరణించారు. మరో 987 మంది చికిత్స పొందుతున్నారని ఇరాన్‌ మీడియా వెల్లడించింది. దక్షిణ కొరియాలో కూడా ఈ వైరస్‌ విశ్వరూపం చూపిస్తోంది. కొత్తగా మరో 376 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 3,526కి చేరుకుంది.  

చైనాలో మరో 35 మంది మృతి  
ఇక చైనాలో ఆదివారం ఒక్కరోజే 35 మంది మరణించారు. మరో 570 తాజా కేసులు నమోదయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 2,870కి చేరుకుంటే, వైరస్‌ సోకిన వారి సంఖ్య 79,824కి చేరుకుంది. కరోనా వైరస్‌ సోకిన వారిలో 60 ఏళ్ల వయసు  పైబడినవారు, హైపర్‌ టెన్షన్‌ ఉన్నవారే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

మరిన్ని వార్తలు