కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం

9 Apr, 2020 14:52 IST|Sakshi
ఫైల్ ఫోటో

లండన్ : మానవాళికి పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ అందుబాటులో లేదు. కోవిడ్-19 నివారణకు టీకాలను రూపొందించే పనిలో ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు తలమునకలైవున్నారు. ప్రధానంగా వ్యాక్సిన్ రూపకల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ కీలకమైన అంశాన్ని ప్రకటించింది. నయం చేయలేని ఈ వ్యాధికి రాబోయే ఆరు నెలల్లో  వ్యాక్సిన్  తయారు చేయగలమంటూ నమ్మకంగా చెబుతున్నారు.  దీనికి సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తి కావచ్చినట్టేనని తాజాగా ప్రకటించారు.
 
మూడవ దశ ట్రయల్ అనంతరం  కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ సిద్ధమవుతుందని ఆక్సఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. 2020 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలం నాటికి  తొలి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రిటన్‌ చీఫ్‌ సైంటిఫిక్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ వివరించారు. ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్‌ వరకు 500 మంది వాలంటీర్లపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. కనీసం 2021 ప్రారంభంనాటికి  వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసుగల వాలంటీర్లు తమపై పరిశోధనకు ముందుకొచ్చారని, ఇవి విజయవంతమైతే వ్యాక్సిన్ అనుకున్న దానికంటే ముందుగానే అందుబాటులోకి వస్తుందన్నారు.  

ఇప్పటికే చైనాలో మార్చి 17నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని పరిశోధకులు చెప్పారు. మొదటిదశలో చైనాకు చెందిన వాలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రయోగం జరిపినట్టు పరిశోధకులు వెల్లడించారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసున్న ఆరోగ్యవంతులు మొత్తం 108 మందిపై పరిశోధనలు జరిపామని18మంది అబ్టర్వేషన్‌ పూర్తయిందని, వారంతా కరోనానుంచి బయటపడ్డారని వివరించారు. 14 రోజుల ఐసోలేషన్‌ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో బుధవారం ఇంటికి వెళ్లినట్టు వివరించారు. మరో ఆరునెలల పాటు వీరినుంచి రక్త నమూనాలు సేకరిస్తూ, పరిశోధనలు జరుపుతామని, అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. టీకా సమర్థవంతంగా, సురక్షితంగా ఉందని తేలితే విదేశాలలో అదనపు పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

కాగా గతఏడాది చైనాలో విస్తరించిన కరోనా శరవేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమవుతున్నా, వైరస్ విస్తరణ ఉధృతిని నిలువరించడం పెను సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో నిజంగా పరిశోధకుల ప్రయోగాలు ఫలించి వ్యాక్సిన్ సిద్ధమయితే యావత్ ప్రపంచానికి భారీ ఊరట లభించినట్టే.

మరిన్ని వార్తలు