తల తీసి అతికించారు

19 Nov, 2017 09:39 IST|Sakshi

ఒక శవం తల ఇంకో మొండేనికి అతికించిన డాక్టర్లు

ప్రయోగం విజయవంతమైంది..

ఇటలీ శాస్త్రవేత్త సెర్గి కానవేరో వెల్లడి

చైనాలో 18 గంటల శస్త్రచికిత్స

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: సెర్గి కానవేరో పేరు ఎప్పుడైనా విన్నారా? ఏడాది క్రితం వార్తా పత్రికల పతాక శీర్షికలకు ఎక్కారీయన. ఒక వ్యక్తి తలను ఇంకో వ్యక్తి మొండేనికి అతికిస్తానని ప్రకటించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తాజాగా సెర్గి ఇంకో రికార్డు సృష్టించారు. ఒకరి తలను ఇంకొకరికి అమర్చడం సాధ్యమేనని నిరూపించేందుకు ఆయన బృందంలోని డాక్టర్‌ ఒకరు చైనాలో ఒక శవంపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. డాక్టర్‌ షియావ్‌పింగ్‌ రెన్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగిందని.. వెన్నెముకతోపాటు నాడులు, రక్తనాళాలు అన్నింటినీ ఇంకో మొండేనికి అతికించగలిగామని కానవేరో వెల్లడించారు.

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘పుట్టు.. పెరుగు.. చావు అంటూ ఇంతకాలం మనమెలా బతకాలో ప్రకృతి నేర్పించింది. మనిషి పరిణమించే క్రమంలో కోట్ల మంది చనిపోయారు. ఇది భారీ స్థాయిలో జరిగిన మారణకాండ అని నేనంటాను. అయితే ఇకపై ఇలా జరగదు. మన భవిష్యత్తు ఏదో మనమే నిర్ణయించుకునే సమయం వచ్చేసింది’ అని కానవేరో ప్రకటించారు. తలల మార్పిడి ప్రక్రియ విజయవంతమైతే ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు. ఇటీవల చైనాలో దాదాపు 18 గంటలపాటు శస్త్ర చికిత్స జరిపి ఒక శవం తలను ఇంకో మొండేనికి మళ్లీ అతికించగలిగామని ప్రకటించారు. శస్త్రచికిత్స వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తర్వాతి ప్రయోగాల్లో భాగంగా త్వరలోనే బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి తలలు మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. చిట్టచివరిగా బతికున్న వ్యక్తి తలను ఇంకో మొండేనికి అతికించేందుకు ప్రయత్నిస్తామని, ఇది అనివార్యమని పేర్కొన్నారు. ప్రస్తుతానికి మనిషి ఆయుష్షును పెంచే సాధనంగా కాకుండా.. వైద్యపరమైన సమస్యలు ఎదుర్కొనే వారికి ఒక పరిష్కారంగా మాత్రమే ఈ తలల మార్పిడిని చేపడతామని స్పష్టం చేశారు.

పెదవి విరిచిన శాస్త్రవేత్తలు
కానవేరో ప్రయోగాలపై అప్పుడే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వైద్య శాస్త్రానికైనా ఈ ప్రయోగం తాలూకు ప్రయోజనం శూన్యమని, కానవేరో చేస్తున్నది నైతికంగా చాలా తప్పని యూనివర్సిటీ హాస్పిటల్‌ ఆఫ్‌ సౌత్‌ మాంచెస్టర్‌కు చెందిన డాక్టర్‌ జేమ్స్‌ ఫైల్డ్‌ వ్యాఖ్యానించారు. తల మార్పిడి ద్వారా ఓ భారీ సైజు జీవి జీవన ప్రమాణాన్ని ఎంతో కొంత మెరుగుపరచగలరన్నది నిరూపణ అయ్యేంత వరకూ.. తగిన సాక్ష్యాలు వీరు చూపించాల్సి ఉంటుందని చెప్పారు.

మరిన్ని ప్రయోగాలకు సిద్ధం
రెండేళ్ల క్రితం రష్యాకు చెందిన కంప్యూటర్‌ సైంటిస్ట్‌ వాలరె స్పిరిడినోవ్‌ తలను ఇంకో మొండేనికి అతికిస్తానని కానవేరో ప్రకటించినప్పటి నుంచి ఈ అంశంపై ఎన్నో చర్చలు మొదలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ప్రయోగానికి అంగీకరించిన స్పిరిడినోవ్‌ ప్రస్తుతం తనకు ఆరోగ్యవంతమైన శరీరం లభించడం కష్టమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కానవేరో చైనాలో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చిన్న స్థాయి జంతువుల తలలు మార్చిన ఈయన బృందం వాటిలో విజయం సాధించింది. వీరు ఒక ఎలుకకు అదనంగా ఇంకో తలను జోడించి దాన్ని 36 గంటలపాటు జీవించి ఉండేలా చేయగలిగారు.

మరిన్ని వార్తలు