రాయల్‌ సొసైటీకి తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త

20 Apr, 2019 10:33 IST|Sakshi
గగన్‌దీప్‌ కాంగ్‌ (ఫైల్‌ ఫోటో)

రాయల్‌ సొసైటీకీ ఎంపికైన తొలి మహిళా శాస్త్రవేత్త  గగన్‌దీప్‌ కాంగ్‌

ప్రాణాంతక రోటా వైరస్‌ టీకాపై కాంగ్‌ పరిశోధనలు

 ప్రొఫెషనల్‌ సలహా విషయంలో మహిళలకు, పురుషులకు తేడా వుండదు 

పట్టుదలతో సాధించాలి

ప్రతిష్టాత్మక లండన్‌ రాయల్‌ సొసైటీలో భారతీయ మహిళా శాస్త్రవేత్త స్థానం  సంపాదించారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరుగా భారతీయ శాస్త్రవేత్త గగన్‌ దీప్‌ కాంగ్‌ ఎంపికయ్యారు.   అంతేకాదు  రాయల్‌ సోసైటీకి ఎంపికైన  తొలి భారతీయ మహిళా సైంటిస్ట్‌గా కాంగ్‌ ఘనతను దక్కించుకున్నారు. 

సైన్స్ రంగంలో వారి అసాధారణమైన రచనలు చేసిన ప్రపంచవ్యాప్తంగా 51 ప్రముఖ శాస్త్రవేత్తల జాబితాను ఏప్రిల్ 16న  ప్రకటించింది.  వీరిలో  కాంగ్‌ ఒకరు.  రాయల్ సొసైటీ విజ్ఞాన శాస్త్రంలో శ్రేష్ఠమైనది.  తన కృషికి గుర్తింపు లభించినందుకు  చాలా  సంతోషంగా ఉందన్నారు కాంగ్‌. వెల్లూరులోని  ప్రముఖ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూర్ గాస్ట్రో ఇంటెస్టినల్‌ సైన్స్‌స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న కాంగ్‌, ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషన్‌ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (బయోటెక్నాలజీ సెన్సెస్‌, సాంకేతిక మంత్రిత్వ విభాగానికి అనుబంధ సంస్థ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా  కూడా ఉన్నారు.   

ప్రాణాంతకమైన రోటా వైరస్‌ అంటువ్యాధుల నిరోధంపై ఆమె చేసిన కృషికిఈ గుర్తింపును గడించారు. భారతీయ పిల్లల్లో సహజంగా  రోగనిరోధక శక్తే  తక్కువగా ఉండటమే రోటా వైరస్ అంటురోగాలకు కారణమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో రోటా వైరస్‌ టీకా ఎందుకు సమర్థవంతమైంది కాదు అనే అంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి  ఆమె ఏర్పాటు చేసిన క్లినికల్ లాబ్‌ పరిశోధనలు సహకరించాయి.  భారతదేశం సహా చైనా, బ్రెజిల్‌కు చెందిన శాస్త్రవేత్తలకు, టీకా తయారీ దారులకు ఈ ల్యాబ్‌ శిక్షణ ఇస్తుండటం విశేషం.    

అందుకున్న అవార్డులు
2010లో అమెరికన్ అకాడమీ ఆఫ్ మైక్రోబయాలజీ ఫెలోషిప్‌, 2011లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, 2013లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, 2015లో పబ్లిక్ హెల్త్ ఫ్యాకల్టీ,  2006లో భారత ప్రభుత్వం నుంచి విమెన్‌ బయోసైంటిస్టు ఆఫ్ ది ఇయర్ , 2016 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అవార్డున, అవార్డును కూడా గెలుచుకున్నారు. 2016 లో (లైఫ్ సైన్సెస్‌) ఇన్ఫోసిస్ సైన్స్ బహుమతిని  అందుకున్నారు. 

మహిళలకు ఆమె ఇచ్చే సలహా
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాల్లోని మహిళలకుఏ సలహా ఇస్తారు అని అడిగినపుడు ‘పెద్ద ఛాలెంజెస్‌ను స్వీకరించండి..మీకు మీరే గానీ, ఇతరుల సహకారంతోగానీ  ప్రతి అంశాన్ని పూర్తిగా అన్వేషించండి..ఎట్టి పరిస్థితులలోనూ ఓటమిని అంగీకరించకండి’ అని చెప్పారు. నిజానికి ప్రొఫెషనల్ సలహా విషయంలో  మహిళలకు, పురుషులకు పెద్ద వ్యత్యాసం  ఉండదన్నారు.  అయితే  మహిళలను వెనక్కి నెట్టకుండా సాధికారిత వైపు  నడిపించాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉందనన్నారు.  అలాగే నాయకత్వం స్థానాల్లో ఉన్న మహిళలు  తోటి మహిళల  సాధికారతకు మద్దతు అందించడం చాలా అవసరమని కాంగ్‌ అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు