‘ఆప్టికల్‌ లేజర్‌’కు నోబెల్‌

3 Oct, 2018 01:35 IST|Sakshi
జెరార్డ్‌ మోరో , డొనా స్ట్రిక్‌లాండ్‌ , ఆర్థర్‌ ఆష్కిన్‌

ముగ్గురిని వరించిన భౌతిక శాస్త్ర నోబెల్‌ బహుమతి

ఆర్థర్‌ ఆష్కిన్, జెరార్డ్‌ మోరో, డొనా స్ట్రిక్‌లాండ్‌లను ఎంపిక చేసినట్లు అకాడమీ ప్రకటన

55 ఏళ్లలో ఈ అవార్డు గెలిచిన తొలి మహిళ డొనా  

స్టాక్‌హోం: ఆప్టికల్‌ లేజర్‌లపై కీలక పరిశోధనలు చేసి కంటి శస్త్రచికిత్సల్లో అధునాతన పరికరాలను ఉపయోగించేందుకు దోహదపడిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ భౌతికశాస్త్ర బహుమతి దక్కింది. అమెరికా శాస్త్రజ్ఞుడు ఆర్థర్‌ ఆష్కిన్‌ (96), ఫ్రాన్స్‌కు చెందిన జెరార్డ్‌ మోరో (74), కెనడా శాస్త్రజ్ఞురాలు డొనా స్ట్రిక్‌లాండ్‌ (59)లను ఈ ఏడాది నోబెల్‌ భౌతిక శాస్త్ర బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మంగళవారం ప్రకటించింది.

భౌతిక శాస్త్ర నోబెల్‌ను తొలిసారిగా 1901లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ బహుమతి అందుకున్న మూడో మహిళ, 55 ఏళ్లలో తొలి మహిళ డొనా స్ట్రిక్‌లాండ్‌ కావడం విశేషం. అలాగే నోబెల్‌ బహుమతి పొందిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆర్థర్‌ ఆష్కిన్‌ నిలవడం మరో విశేషం. 2007లో అమెరికా ఆర్థికవేత్త లియోనిడ్‌ హర్విచ్‌ తనకు 90 ఏళ్ల వయ సులో నోబెల్‌ పొందగా, ఆర్థర్‌ ఆష్కిన్‌ 96 ఏళ్ల వయసులో నోబెల్‌ గెలుచుకుని రికార్డు నమో దు చేశారు. నోబెల్‌ బహుమతి మొత్తం విలువ 1.01 మిలియన్‌ డాలర్లు కాగా, ఇందులో సగాన్ని ఆర్థర్‌ ఆష్కిన్‌కు, మిగిలిన సగాన్ని మళ్లీ రెండు సమ భాగాలుగా చేసి జెరార్డ్‌ మోరో, డొనా స్ట్రిక్‌లాండ్‌లకు ఇవ్వనున్నారు.

ఆప్టికల్‌ ట్వీజర్ల తయారీకి తగిన గుర్తింపు
సూక్ష్మ క్రిములు, అణువులు, పరమాణువులు, ఇతర జీవించి ఉన్న కణాలను లేజర్‌ బీమ్‌లను ఉపయోగించి పట్టుకునే ఆప్టికల్‌ ట్వీజర్ల (పట్టుకారు వంటివి)ను తయారుచేసినందుకు ఆర్థర్‌ ఆష్కిన్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ ట్వీజర్ల సాయంతో కాంతి ధార్మిక పీడనాన్ని ఉపయోగించి భౌతిక పదార్థాలను ఆయన కదల్చగలిగారని అకాడమీ తెలిపింది.

ఆష్కిన్‌ 1952 నుంచి 1991 మధ్య కాలంలో అమెరికాలోని ఏటీ అండ్‌ టీ బెల్‌ ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న కాలంలోనే 1987లో సూక్ష్మజీవులకు హాని చేయకుండానే వాటిని పట్టుకునే ట్వీజర్లను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకుగాను ఆయనకు నోబెల్‌ ఇస్తున్నట్లు అకాడమీ తెలిపింది. 1991లో పదవీ విరమణ పొందిన ఆష్కిన్, అప్పటి నుంచి తన ఇంట్లోని ప్రయోగశాలలోనే జీవితం గడుపుతున్నారు.

మరోవైపు అత్యంత చిన్న ఆప్టికల్‌ పల్స్‌లను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసినందుకు జెరార్డ్‌ మోరో, డొనా స్ట్రిక్‌లాండ్‌లకు నోబెల్‌ లభించింది. మోరోకు ఫ్రాన్స్‌లోని ఎకోల్‌ పాలిటెక్నిక్‌తోపాటు అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉండ గా, డొనా స్ట్రిక్‌ల్యాండ్‌ ఆయన విద్యార్థినే. ప్రస్తు తం ఆమె కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. వీరు ఉత్పత్తి చేసిన ఆప్టికల్‌ పల్స్‌ అత్యంత చిన్నవి, సమర్థవంతమైనవని జ్యూరీ పేర్కొంది.


మహిళలు చాలా అరుదు: డొనా స్ట్రిక్‌లాండ్‌
నోబెల్‌ బహుమతిని ప్రకటించిన అనంతరం డొనా అకాడమీతో ఫోన్‌లో మాట్లాడారు. స్త్రీలకు పెద్దగా దక్కని అవార్డును తాను అందుకోవటం తనను పులకరింపజేస్తోందని ఆమె అన్నారు. ‘మహిళా భౌతిక శాస్త్రవేత్తలు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి వారు చాలా ప్రత్యేకం. అలాంటి వారిలో నేనొకరిని అయినందుకు గర్వంగా ఉంది’ అంటూ స్ట్రిక్‌లాండ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

స్ట్రిక్‌లాండ్‌ కన్నా ముందు 1903లో మేడం క్యూరీకి, 1963లో మరియా గోప్పెర్ట్‌ మాయెర్‌కు మాత్రమే భౌతిక శాస్త్ర నోబెల్‌ బహుమతి దక్కింది. అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్‌ అందుకున్న మూడో మహిళ. మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతులు తక్కువగా వస్తుండటంపై అకాడమీ గతంలోనే విచారం వ్యక్తం చేసింది. తామేమీ పురుషుల పట్ల పక్షపాతంతో వ్యవహరించడం లేదనీ, క్షేత్రస్థాయిలో ప్రయోగశాలల తలుపులు మహిళలకు చాలా చోట్ల మూసుకుపోయాయని గతంలో వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు