ఒకే వేదికపై.. ఐదుగురు మాజీలు

22 Oct, 2017 17:15 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఇటీవల కాలంలో అమెరికాను వణికించిన హార్వీ, ఇర్మా,  మరియా తుఫాను బాధితులను ఆదుకేనుందుకు ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు నడుంబిగించారు. తుఫానుల కారణంగా టెక్సాస్‌, ఫ్లోరిడా, లూసియానా, పోర్టారికో, వర్జిన్‌ ఐలాండ్స్‌ ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి.  తుపాను బాధితుల నిధుల సేకరణకు రంగంలోకి దిగిన మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌, బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌ (సీనియర్‌) జిమ్మీ కార్టర్‌లు శనివారం టెక్సాస్‌లోని ఏఅండ్‌ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.

డెమోక్రాట్‌ పార్టీ నుంచి బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌, జిమ్మి కార్టర్‌లు, రిపబ్లికన్‌ పార్టీ నుంచి జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్‌, జార్జి డబ్ల్యూ బుష్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిన్‌ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్‌ (93) పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతూనే చక్రాల కుర్చీలోనే కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామీ అవార్డే విజేత లేడీ గాగా తన డ్యాన్స్‌తో అలరించారు. నిధుల సేకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 7 నుంచి ఐదుగురు మాజీ అధ్యక్షులు చేపట్టారు. ఇప్పటివరకూ 31 మిలియన్‌ డాలర్ల నిధులను వీరు సమకూర్చినట్లు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్‌ అధికార ప్రతినిధి జిమ్‌ మెక్‌గ్రాత్‌ తెలిపారు.

తుఫాను బాధితుల కోసం నిధుల సమకూరుస్తున్న ఐదుగురు మాజీ అధ్యక్షులను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు. అమెరికా అత్యున్నత ప్రజా సేవకులుగా వారిని ట్రంప్‌ అభివర్ణించారు. మాజీలెవరూ.. తమ ప్రసంగంలో ట్రంప్‌ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు