మృతుల్లో ఐదుగురు భారతీయులు

18 Mar, 2019 04:36 IST|Sakshi
ఓజైర్‌ ఖదీర్‌(ఫైల్‌), ఆస్ట్రేలియాలోని ఒపెరా హౌస్‌పై క్రైస్ట్‌చర్చ్‌ మృతులకు నివాళిగా లేజర్‌ షో

ప్రకటించిన న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్‌

మరో హైదరాబాదీ కూడా మృతి

చనిపోయినట్లుగా భావిస్తున్న మరో ఇద్దరు హైదరాబాదీల పేర్లు లేకుండానే జాబితా

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌ చర్చ్‌ నగరంలో శుక్రవారం రెండు మసీదుల వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులున్నారని న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్‌ ఆదివారం ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్‌ టారంట్‌ అనే వ్యక్తి జాత్యహంకారంతో అల్‌ నూర్, లిన్‌వుడ్‌ మసీదుల వద్ద ఈ కాల్పులు జరపగా, 50 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత క్రైస్ట్‌చర్చ్‌లో 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైందని శుక్రవారమే హై కమిషన్‌ కార్యాలయం వెల్లడించింది.

ఐదుగురు భారతీయులు ఈ కాల్పుల్లో చనిపోయారని తాజాగా ధ్రువీకరించింది. మరణించిన భారతీయులను మహబూబ్‌ ఖోఖర్, రమీజ్‌ వోరా, అసీఫ్‌ వోరా, అన్సీ అలిబవ, ఓజైర్‌ ఖదీర్‌గా గుర్తించామంది. వీరిలో ఓజైర్‌ ఖదీర్‌ హైదరాబాద్‌ వాసి. కాగా, మరో ఇద్దరు హైదరాబాదీలు హసన్‌ ఫరాజ్, మహ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌లు కూడా మృతి చెందినట్లు శనివారం సమాచారం వచ్చినా, ఆదివారం హై కమిషన్‌ విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం.

క్రైస్ట్‌ చర్చ్‌ బాధితుల కుటుంబ సభ్యులకు వీసాలను త్వరగా మంజూరు చేసేందుకు న్యూజిలాండ్‌ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిందని హై కమిషన్‌ కోరింది. కాగా, తమ కుటుంబ సభ్యుడు టారంట్‌ ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం తమకు విభ్రాంతి కలిగించిందనీ, తాము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం టారంట్‌ సోదరి, తల్లిపై ఎవరూ దాడి చేయకుండా పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారని టారంట్‌ నానమ్మ చెప్పారు.  కాగా, టారంట్‌ కాల్పుల ఘటనను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని అడ్డుకోలేకపోవడంపై ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాధానాల కోసం వేచి చూస్తున్నానని ప్రధాని జసిండా తెలిపారు.

బుల్లెట్లు లేని తుపాకీతో తరిమాడు
కాల్పుల సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి గుండ్లు లేని తుపాకీతో హంతకుడిని తరిమిన ఓ వ్యక్తిపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి వచ్చి న్యూజిలాండ్‌లో శరణార్థిగా ఉంటున్న అబ్దుల్‌ అజీజ్‌.. లిన్‌వుడ్‌ మసీదులో హంతకుడు టారంట్‌ మరింత మందిని కాల్చకుండా నిలువరించి ఈ ఘటనలో హీరోగా నిలిచాడు. కాల్పుల శబ్దం వినపడగానే అజీజ్‌ తొలుత కేవలం క్రెడిట్‌ కార్డులను స్వైప్‌ చేసే మిషన్‌ను తీసుకెళ్లి టారంట్‌ పైకి విసిరి అతని దృష్టిని మళ్లించాడు. అనంతరం టారంట్‌ కాల్పులు జరిపి, బుల్లెట్లు అయిపోవడంతో  పడేసిన తుపాకీ ఒకటి అతనికి దొరికింది. ఆ తుపాకీతో అజీజ్‌ బెదిరించడంతో టారంట్‌ తన తుపాకీని కింద పడేశాడు. టారంట్‌ను అజీజ్‌ వెంటాడుతూ వెళ్లి, కారులో పారిపోతుండగా, కారు వెనుక అద్దాన్ని పగులగొట్టాడు. అజీజ్‌ ఈ సాహసం చేయకపోయుంటే మరింతమంది ప్రాణాలు కోల్పోయేవారంటూ అందరూ  ప్రశంసిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు