టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి అనుకోని అతిథి

10 Apr, 2017 08:45 IST|Sakshi
విమానంలో అనుకోని అతిథికి స్వాగతం

అనుకోని అతిథికి టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది స్వాగతం పలికారు. ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదివారం టర్కిష్‌ ఎయిర్‌లైన్‌ విమానంలో చోటుచేసుకుంది. 28 వారాల గర్భణి అయిన నఫీ డైబీ  గినియా రాజధాని కొనాక్రీకి వెళుతోంది. వాస్తవానికి ఆ బిడ్డ తల్లి మరో రెండు నెలల తర్వాత ప్రసవించాల్సి ఉంది. అయితే విమానంలో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా పురిటి నొప్పులు రావడంతో తోటి ప్రయాణికులతో పాటు, విమాన సిబ్బంది సాయపడి పురుడు పోశారు. విమానంలో పాప పుట్టిన విషయాన్ని తెలియజేయడం తమకెంతో గర్వంగా ఉందని టర్కిష్‌ ఎయిర్‌వేస్‌ పోస్ట్ చేసింది.

అలాగే పురిటి నొప్పులతో బాధపడుతున్న ప్రయాణికురాలు సాయం అందించేందుకు సత్వరమే స్పందించిన తమ విమాన సిబ్బందిని ప్రశంసించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారంటూ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది. ఆ బుజ్జాయికి కదిజు అని పేరు కూడా పెట్టేశారు. అప్పుడే పుట్టిన ఆ పాపతో కలిసి విమాన సిబ్బంది ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ప్రయాణికురాలితో పాటు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు విమాన సిబ్బందికి ట్విట్టర్‌లో అభినందనలు వెల్లువెత్తాయి. టర్కిష్‌ విమాన సిబ్బంది మానవతా దృక్పధంతో ప్రవర్తించారని వ్యాఖ్యానించారు. ఆకాశంలో పుట్టిన ఆ చిన్నారికి బర్త్‌ ప్లేస్‌ ఏమవుతుందని ఒకరంటే, మరొకరు ఆమె ఖచ్చితంగా పైలట్‌ అవుతుందంటూ జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు