నాటకీయంగా డ్రగ్ డీలర్ అరెస్ట్

26 Jul, 2017 17:14 IST|Sakshi
డ్రగ్స్ కావాలని ఫిర్యాదు.. డ్రగ్ డీలర్ అరెస్ట్

ఫ్లోరిడా: డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు ఇతరులకు అలవాటు చేయడం నేరమే. అయితే అమెరికాలో ఓ డ్రగ్ డీలర్ మాత్రం ఈ విషయాలను పట్టించుకోలేదు. ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి తన డ్రగ్స్ బ్యాగు చోరీకి గురైందని ఫిర్యాదుచేసి కటకటాల పాలయ్యాడు. ఫ్లోరిడా పోలీసుల కథనం ప్రకారం.. ఫ్లోరిడాకు చెందిన డేవిడ్ బ్లాక్ మన్ ఓ డ్రగ్ డీలర్. డ్రగ్స్ ప్యాకెట్లను సంచుల్లో నింపి తరచుగా తన కారులో వాటిని సరఫరా చేస్తుండేవాడు.

గత ఆదివారం డేవిడ్ డీల్ లో భాగంగా సంచి నిండా కొకైన్, ఇతరత్రా మాదకద్రవ్యాలను నింపాడు. తన కారులో వాటిని తీసుకెళ్లి వాల్టన్ బీచ్ కు వెళ్లాడు. కారు పార్క్ చేసి కొద్దిసేపు పక్కకు వెళ్లగా తన కారు అద్దాలు ధ్వంసం చేసి ఎవరో డ్రగ్స్ చోరీ చేసినట్లు గుర్తించాడు డేవిడ్. తన డ్రగ్స్ బ్యాగును వెతికిపెట్టాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన డేవిడ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న కారణంగా అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడు డేవిడ్ తనకు మంజూరైన 4000 డాలర్ల పూచికత్తు బెయిల్ పై అనంతరం విడుదలయ్యాడు. ప్లోరిడా పోలీసులు జరిగిన విషయాన్ని వెల్లడిస్తూ నిందితుడి ఫొటోను అధికారిక ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. వీడి తెలివి తెల్లారినట్లే ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు