కారుపై ఎంత ప్రేమరా బాబు నీకు!!

6 Sep, 2019 11:41 IST|Sakshi

అమెరికాలోని ఉత్తర, దక్షిణ కరోలినా రాష్ట్రాలను హారికేన్‌ డొరేన్‌ హడలెత్తిస్తోంది. తుఫాను దాటికి ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఇక కొన్నిరోజుల క్రితం ఫ్లోరిడాపై కూడా హారికేన్‌ తన ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముచ్చడపడి కొనుక్కున్న తన బుజ్జికారు ఎగిరిపోతుందనే భయంతో ఓ వ్యక్తి చేసిన పని నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఫ్లోరిడాకు చెందిన ప్యాట్రిక్‌ ఎల్‌డ్రిడ్జ్‌కు స్మార్టు కార్లంటే ఇష్టం. కొన్నిరోజుల కిత్రం స్మార్ట్‌కారును కొనుగోలు చేసి సరదాగా రోడ్లపై చక్కర్లు కొట్టేవాడు. అనంతరం తన మిగతా కార్లతో పాటు స్మార్ట్‌ కారును గ్యారేజ్‌లో పార్క్‌ చేసేవాడు.

ఈ క్రమంలో తుఫాను మొదలవడంతో స్మార్ట్‌కారు ఎగిరిపోతుందనే భయం పట్టుకుంది అతడికి. దీంతో మెల్లగా కారును డ్రైవ్‌ చేసుకుంటూ ఇంట్లో తెచ్చిపెట్టాడు. అయితే అక్కడ కూడా కారు జాగ్రత్తగా ఉంటుందో లేదోనన్న భయంతో కిచెన్‌లో దానిని పార్కు చేశాడు. అంతేగాకుండా హాయిగా ఇక్కడే వంట చేసుకుని కార్లో కూర్చుని తినవచ్చంటూ తన భార్యకు సలహా పడేశాడు. ఈ విషయం గురించి చెబుతూ... కారు ఎగిరిపోతుందనే భయంతో మావారు ఇలా చేశారు. నా కారును మాత్రం గ్యారేజ్‌లోనే ఉంచారు అంటూ ప్యాట్రిక్‌ భార్య జెస్సికా ఫేస్‌బుక్‌లో తమ స్మార్ట్‌కారు ఫొటోలు షేర్‌ చేశారు. ప్రస్తుతం వైరలవుతోన్న ఈ ఫొటోలపై స్పందించిన నెటిజన్లు.. ‘కారుపై ఎంత ప్రేమ మీకు. ఈ ఐడియా బాగుండటంతో పాటు చాలా కామెడీగా కూడా ఉంది. తుఫాను తగ్గాకైనా కారును బయటికి తీస్తారా లేదా. కిచెన్‌లో కారు ఇరికించిన మీ డ్రైవింగ్ నైపుణ్యం అద్భుతం’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు