అనన్య సామాన్యం: అందరూ మృత్యుంజయులే

10 Jul, 2018 18:46 IST|Sakshi

మే సాయి : 18 రోజుల ఎడతెగని నిరీక్షణ అనంతరం థామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్‌ టీమ్‌ తిరిగి భూమి వెలుపలికి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య మూడు రోజుల పాటు జరిగిన డైవింగ్‌ ప్రక్రియలో ఆదివారం నలుగురు, సోమవారం నలుగురు, మంగళవారం నలుగురు చిన్నారులు, కోచ్‌ను డైవర్లు అత్యంత సురక్షితంగా గుహ వెలుపలికి తీసుకొచ్చారు. వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఫుట్‌బాల్‌ టీమ్‌ను రక్షించడంలో డైవర్లు చూపిన తెగువ అనన్యసామాన్యం. గుహ లోపలికి వెళ్లడమే అతి కష్టమని భావిస్తే. టీమ్‌ సభ్యులను ఒక్కొక్కరిగా బయటకు తేవడానికి డైవర్లు పడిన కష్టానికి ఒట్టి ప్రశంసలు మాత్రమే సరిపోవు. గుహ గోడలు 70 సెంటీమీటర్ల కంటే తక్కువ గ్యాప్‌ ఉన్న సమయంలో డైవర్లు అతి కష్టంపైన బయటకు వచ్చిన తీరును గమనిస్తే ఒళ్లు జలదరిస్తుంది. సదరు వీడియోను తిలకిస్తే మనమైతే శ్వాస తీసుకోవడానికి కూడా శక్తి లేకుండా అయిపోయే వాళ్లమేమో అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు.

18 రోజులుగా గుహకే పరిమితమైన చిన్నారులకు ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉండటంతో వారిని కలిసేందుకు తల్లిదండ్రులకు సైతం అనుమతి ఇవ్వడం లేదు. 48 గంటల తర్వాతే వారిని కలవడానికి తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా, గుహ నుంచి బయటపడ్డ పిల్లల్ని థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి ప్రయుత్‌ చాన్‌-ఓచా ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు.

జూన్‌ 23న ఈ పన్నెండు మంది చిన్నారులు తమ ఫుట్‌బాల్‌ కోచ్‌తో థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత తామ్ లుయాంగ్‌ గుహ చూడడానికి వెళ్లగా వరద ఉద్ధృతి పెరగడంతో అందులోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. తొమ్మిది రోజుల తర్వాత(జులై 7న) వారిని ఇద్దరు బ్రిటీష్‌ డైవర్లు కనిపెట్టారు. ప్రాణాలకు తెగించి పిల్లలను కాపాడిన డైవర్ల సాహసాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కీర్తిస్తున్నారు.

మరిన్ని వార్తలు