మోదీ కోసం హిందీ నేర్చుకుంటున్న ట్రంప్‌

26 Jun, 2017 18:29 IST|Sakshi
మోదీ కోసం హిందీ నేర్చుకుంటున్న ట్రంప్‌
వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ టూర్‌ విజయవంతమయ్యేందుకు అటు అమెరికా అధికారులు, ఇటు భారత అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డోనాల్డ్‌ ట్రంప్‌తో మోదీ అవనున్న తొలి భేటీ ఇదే కానుండటంతో ఇరు దేశాల మధ్య ఈ పర్యటన పూర్తి సక్సెస్‌ సాధించాలని ఇరు వర్గాలు ఆశిస్తున్నాయి. మోదీ పర్యటనపై ఇప్పటికే ఎంతో ఉత్సాహంగా ఉన్న ట్రంప్‌.. తాజాగా మోదీని ఆకట్టుకునేందుకు మరో ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా హిందీ పదాలు కూడా వల్లే వేస్తున్నారంట.

ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేయి, రక్షణ భాగస్వామ్యం పరిస్థితేమిటి? పరస్పర సహకారం ఇప్పటి వరకు ఎలా ఉంది అనే తదితర అంశాల మీద వివరాలు తెప్పించుకున్న ట్రంప్‌.. భారత్‌తో ధృడమైన బంధాన్ని ఏర్పాటుచేసుకునేందుకు తాము సిద్ధం అని చెప్పేలా హిందీ కూడా నేర్చుకుంటున్నారట. ‘ప్రధాని నరేంద్రమోదీతో అయ్యే భేటీ కోసం డోనాల్డ్‌ ట్రంప్‌ హిందీ పదాలు నేర్చుకుంటున్నారు. ఆయన ట్రంప్‌ సర్కార్‌ మోదీ సర్కార్‌కు స్వాగతం పలుకుతోంది’ అనే పదాలు ఉపయోగిస్తారని చికాగోకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శలబ్‌ కుమార్‌ చెప్పారు.

ఈయన అమెరికా ఎన్నికల్లో భారత కమ్యునిటీని ట్రంప్‌ ఆకట్టుకునేలా వ్యూహాలు రచించారు. ఆ సమయంలో కూడా ట్రంప్‌ ఓసారి భారత కమ్యూనిటీని ఉద్దేశిస్తూ ఆప్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అనే పదాలు ఉపయోగించారు. ఆప్‌ కీ బార్‌ మోదీ సర్కార్‌ అనే నినాదాన్ని భారత్‌లో ఎన్నికలకు ప్రధాని మోదీ ఉపయోగించిన విషయం తెలిసిందే.  
మరిన్ని వార్తలు