‘కోరిక’ తీరిస్తేనే ఆకలి తీరేది!

28 Feb, 2018 03:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సిరియాలో మహిళపై లైంగిక దాడులు,వేధింపులు...

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసీస్‌) కబంధ హస్తాల నుంచి విముక్తమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సిరియాలో ఇప్పటికీ మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు.  నేటికీ అక్కడ కొనసాగుతున్న అంతర్యుద్ధ పరిస్థితుల  నేపథ్యంలో  వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి అందే మానవతా సహాయానికి ప్రతిగా మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నట్టుగా తాజాగా వెలుగులోకి వచ్చింది.  

ఐరాస, ఇతర అంతర్జాతీయ సేవా  సంస్థలు వివిధ రూపాల్లో ఇచ్చే ఉచిత సహాయం పొందేందుకు మధ్యదళారులకు  ఆ దేశ యువతులు, అమ్మాయిలు తమను తాను సమర్పించుకోవాల్సిన అమానవీయ స్థితి ఏర్పడింది.  సిరియాలో  కొన్ని  ప్రాంతాల్లో  ఇంకా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున్న అక్కడకు స్వచ్ఛంద సేవా సంస్థల సిబ్బంది చేరుకోలేకపోతున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో  ఐరాస, ఇతర సంస్థలిచ్చే సహాయాన్ని బాధితులకు చేరవేసే బాధ్యతను∙మధ్యదళారులు, స్థానిక అధికారులకు అప్పగిస్తున్నారు.   

యుద్ధ బీభత్సం కొనసాగుతున్న  కారణంగా  అక్కడి ప్రజలు ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలకు పూట కింత తిండితో పాటు కనీస నిత్యావసరాలు దొరకని స్థితి ఏర్పడింది.  దీనిని అవకాశంగా తీసుకుని స్థానిక అధికారులు, మధ్యదళారి సంస్థల ప్రతినిధులు తాము అందించే సహాయానికి ప్రతిగా ఆ యువతులు తమ లైంగిక వాంఛను తీర్చేలా వత్తిడి తెస్తున్నారు.

బాధితులకు ప్రధానంగా మహిళలకు ఈ సహాయం అందకుండా నిలిపేస్తున్నారు. తమ దారికి వచ్చిన వారికే వాటిని ఇస్తున్నట్టుగా బీబీసీ  వెల్లడించింది. ఇలాంటి వేధింపులు, ఉల్లంఘనలు జరుగుతున్నట్టుగా మూడేళ్ల క్రితమే హెచ్చరికలు వెలువడ్డాయి. అయినా సిరియాలోని దక్షిణ ప్రాంతంలో నేటికీ ఇవి కొనసాగుతున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది.

సహాయ కేంద్రాలకు వెళ్లాలంటేనే భయం...
సిరియాలో ఇలాంటి అనైతిక కార్యకలాపాలు పెచ్చు మీరడంతో అంతర్జాతీయ సేవా సంస్థల ద్వారా ఉచితంగా అందే సహాయాన్ని  తీసుకునేందుకు కూడా మహిళలు జంకుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఈ అమానవీయ పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో ఈ సహాయ కేంద్రాలకు వెళ్లేందుకు అక్కడి మహిళలు నిరాకరిస్తున్నట్టు  స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు బీబీసీకి వెల్లడించారు.

అక్కడి మగవారి కోరికలను తీర్చాకే  ఈ సంస్థలిచ్చే సహాయాన్ని తాము  వెంట తెచ్చుకున్నామని ఇతరులు భావించే అవకాశమున్నందున ఈ సరఫరా కేంద్రాలకు వెళ్లడం లేదని కొందరు యువతులు తెలిపారు. ఇలాంటి ఆకృత్యాలు సాగుతున్నా కొన్ని స్వచ్ఛందసంస్థలు పట్టించుకోవడం లేదని ఓ ఉద్యోగి పేర్కొన్నాడు. సిరియాలో గవర్నర్ల పాలనలోని వివిధ ప్రాంతాల్లో మానవతా సహాయానికి ప్రతిగా లైంగికదోపిడి సాగుతున్నట్టుగా గతేడాది ఐరాస జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) చేసిన పరిశీలనలో తేలింది.

ఆహారం కోసం స్వల్పకాల వివాహాలు...
‘స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే రోజువారి ఆహారం కోసం  యువతులు, అమ్మాయిలు పరిమిత కాలానికి వివాహాలు చేసుకుని అక్కడి అధికారులకు ‘సెక్సువల్‌ సర్వీసెస్‌’ అందిస్తున్నారు. సహాయాన్ని తీసుకు నేందుకు వచ్చే వారి ఫోన్‌ నెంబర్లు తీసుకోవడంతో పాటు వారిని ఇంటివరకు వాహనాల్లో వదిలిపెడు తున్నారు. తాము అందజేస్తున్న సహాయాలకు ప్రతిగా అధికారులు, ప్రతినిధులు కోరిక తీర్చుకుంటున్నారు’ అని వాయిస్‌ ఫ్రం సిరియా 2018 నివేదిక వెల్లడించింది.

పురుషుల పరిరక్షణలోని మహిళలు, అమ్మాయిలతో పాటు భర్తను కోల్పోయిన, విడాకులు తీసుకున్న వారి పరిస్థితి మరింత అధ్వాన్నం అని పేర్కొంది. జోర్డన్‌లోని ఓ శరణార్థుల శిబిరంలో సిరియా మహిళ బృందం ఇలాంటి లైంగికదాడులకు గురైనట్లు మూడేళ్ల క్రితం మొదటిసారి బయటపడింది. దారా, క్యునీత్ర తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై తాను జరిపిన పరిశీలనల్లో ఇది యధార్థమేనని తేలిందని స్వచ్ఛంద సహాయ సలహాదారు డానియల్‌ స్పెన్సర్‌ తెలిపారు.

కొత్త విధానాలు ప్రవేశపెట్టామంటున్న ఐరాస...
దక్షిణ సిరియాలో మహిళలు లైంగిక వేధింపులు, దోపిడికి గురవుతున్నారనే  ఆరోపణలపై  యూఎన్‌ఎఫ్‌పీ ఏ, ఆక్స్‌ఫామ్‌ ప్రతినిధులు స్పందిస్తూ తాము స్థానిక కౌన్నిళ్ల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని స్పష్టం చేశాయి. తమ కార్యకలాపాలు నెరుపుతున్న రెండు స్వచ్ఛంద సంస్థలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని యూఎన్‌ఎఫ్‌పీఏ తెలిపింది. ఇలాంటి ఘటనల నివారణకు కొత్త విధానాలు ప్రవేశపెట్టినట్టు, ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు స్థానిక భాగస్వామ్య సంస్థలకు అవసరమైన శిక్షణనిస్తున్నట్టు ఐరాస శరణార్థుల హైకమిషనర్‌ (యూఎన్‌హేచ్‌సీఆర్‌) ప్రతినిధి పేర్కొన్నారు.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు