-

‘మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు’

9 Jul, 2020 10:43 IST|Sakshi

అమెరికా నిర్ణయం పట్ల విదేశీ విద్యార్థుల ఆందోళన

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఐసీఈ(ద ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) చేసిన ప్రకటన తమ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టిందని అమెరికాలో విద్యనభ్యసిస్తున్న పలువురు విదేశీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉన్న వేళ ఇప్పటికిప్పుడు స్వదేశానికి వెళ్లలేమని, ఒకవేళ ఇక్కడే ఉంటే వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళనకు గురువుతున్నారు. లోన్లు తీసుకుని.. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి, మెరుగైన భవిష్యత్తు ఉంటుందని భావించి ఇక్కడకు వస్తే అంచనాలన్నీ తలకిందులయ్యాయని వాపోతున్నారు. కాగా కోవిడ్‌–19 నేపథ్యంలో అమెరికా విశ్వవిద్యాలయాలు పూర్తిగా ఆన్‌లైన్‌ క్లాసుల వైపు మొగ్గిచూపినట్లయితే విదేశీ విద్యార్థులు వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని ఐసీఈ సోమవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

అదే విధంగా విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లకపోతే కఠిన చర్యలు ఉంటాయని, ఇకపై ఆన్‌లైన్‌ క్లాసులతో నడిచే కోర్సులకు వీసాల జారీ కూడా ఉండదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకుంటున్న లక్షలాది మంది భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో వత్సలా థాపర్‌ అనే యువతి సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. లాస్‌ఏంజెల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కరోలినాలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌(ఐదో సెమిస్టర్‌) అయిన ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. (ఆన్‌లైన్‌ క్లాసులా...? మీ దేశాలకు వెళ్లిపోండి!)

‘‘ఐసీఈ ఆదేశాల ప్రకారం..  వివిధ కోర్సుల్లో చేరిన విదేశీ విద్యార్థులు నేరుగా విద్యాబోధన చేసే చోటికి బదిలీ లేదా ఇతర చర్యలు తీసుకోవాలి. ఇదంతా బాగానే ఉంది. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యా సంస్థలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో తెలియదు. ఒకవేళ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలు మమ్మల్ని వెనక్కి పంపిస్తాయి. అప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులు వినాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మేం దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ దేశాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించారు. అమెరికా సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళ్లాలనుకున్నా.. విమాన చార్జీలు విపరీతంగా పెరిగాయి. మా కాలేజీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం చెప్పిన క్రమంలో నేను మార్చి 18న ఢిల్లీకి వచ్చేశాను. ఇప్పుడు ఒకవేళ కాలేజీ తెరిచి.. ప్రత్యక్ష క్లాసులు నిర్వహిస్తే నేను అమెరికాకు ఎలా వెళ్లగలను? నాలాగే స్వదేశాలకు వెళ్లిన విద్యార్థులు కాలేజీకి ఎలా వెళ్తారు? ఇదిలా ఉంటే.. హార్వర్డ్‌ యూనివర్సిటీ ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఆ యూనివర్సిటీ కోర్టుకు వెళ్లినా.. ఆ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. నిబంధనల ప్రకారం అమెరికాను వీడిన వారికి మళ్లీ ఆ దేశంలో ప్రవేశం ఉండదు.(‘ఆన్‌లైన్‌’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ) 

నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ విద్యార్థుల కంట్రిబ్యూషన్‌ కూడా ఏమీ తక్కువగా లేదు. అలాంటప్పుడు ఇలా మా ప్రాణాల్ని, భవిష్యత్‌ను గందరగోళంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం? చాలా మంది ఇప్పటికే ఇంటి అద్దె కోసం యజమానులతో ఒప్పందాలు చేసుకుని ఉన్నారు. మధ్యలో వెళ్లిపోతామంటే కుదరదు. డబ్బు పూర్తిగా చెల్లించమంటారు. ఫీజు కట్టడానికే ఎన్నో కష్టాలు పడుతూ, లోన్లు తీసుకున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇది అదనపు భారం. నాలాగా టెక్నికల్‌, లాబ్‌- బేస్డ్‌ క్లాసులు, ప్రాక్టికల్‌ క్లాసులకు హాజరు కావాల్సిన వారికి ఆన్‌లైన్‌ క్లాసులు ఎంతమేరకు ప్రయోజనం చేకూరుస్తాయి. చాలా దేశాల్లో ఆన్‌లైన్‌ క్లాసులు సజావుగా సాగే మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. ఇంటర్నెట్‌ సదుపాయం లేక, కరెంటు కోతలతో ఇబ్బందిపడే వారు ఎందరో ఉన్నారు. విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆకాంక్షిస్తున్నాను. అయితే అది ఎంత వరకు నెరవేరుతుందో తెలియదు’’ అని ఆవేదన చెందారు.

మరిన్ని వార్తలు