బంగ్లా మాజీ ప్రధాని జియాకు జైలు

9 Feb, 2018 02:19 IST|Sakshi
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా

అవినీతి కేసులో ఢాకా కోర్టు తీర్పు

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియా(72)కు ఓ అవినీతి కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. దీంతో డిసెంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆమె అనర్హతకు గురయ్యే వీలుంది. తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్‌ రెహ్మాన్‌ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అనాథ శరణాలయానికి సేకరించిన విదేశీ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు గురువారం ఈ తీర్పు వెలువరించింది.

జియా కొడుకు, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తారిక్‌నూ దోషిగా తేల్చిన కోర్టు..ఆయనతో పాటు మరో నలుగురికి 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం తారిక్‌ లండన్‌లో అజ్ఞాతంలో ఉన్నారు.  దోషులందరికి ఈ కేసులో సమాన పాత్ర ఉన్నా జియా వయసు, సమాజంలో ఉన్న గౌరవం రీత్యా ఆమెకు కాస్త తక్కువ శిక్ష విధిస్తున్నట్లు జడ్జి మహ్మద్‌ అక్తారుజ్జమాన్‌ తన తీర్పు ప్రతిలో పేర్కొన్నారు. తాజా తీర్పును హైకోర్టులో సవాల్‌ చేస్తామని జియా తరఫు లాయర్‌ వెల్లడించారు.

తీర్పు రాగానే జియా మద్దతుదారులు, అభిమానులు ఆందోళనలకు దిగి ఢాకాలో పలుచోట్ల హింసకు పాల్పడ్డారు. కోర్టు బయట గుమిగూడిన ఆందోళనకారులను చెదరగొట్టడం పోలీసులకు కష్టమైంది. భారీ భద్రత నడుమ జియాను కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రతిపక్ష బీఎన్‌పీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్న ఆమె.. మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. కాగా, అంతకు ముందు జియా తన మద్దతుదారులు, బంధువులకు ధైర్యవచనాలు చెప్పి కోర్టుకు బయల్దేరారు. ‘మీరేం భయపడకండి. ధైర్యంగా ఉండండి. నేను క్షేమంగా తిరిగొస్తా’ అని ఆమె అన్నారు.  జియా గతంలో చేసిన పాపాలకు ఫలితంగానే ఈ శిక్ష పడిందని ఆమె ప్రధాన ప్రత్యర్థి, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు.

మరిన్ని వార్తలు