బుష్‌ కుటుంబంలో విషాదం

18 Apr, 2018 10:30 IST|Sakshi

మాజీ ప్రధమ మహిళ బార్బరా పియర్స్‌ బుష్‌ కన్నుమూత

మిడ్‌లాండ్‌(టెక్సాస్)‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌(సీనియర్‌) సతీమణి బార్బరా పియర్స్‌ బుష్‌(92) కన్నుమూశారు. వృద్ధాప్యంలోనూ చలాకీగా వ్యవహరించే ఆమె మంగళవారం ఇంట్లో ఉన్నప్పుడే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారని బుష్‌ కుటుంబ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. బార్బరా మరణంతో బుష్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా పలు దేశాల ప్రముఖులూ బుష్‌ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

16 ఏళ్లకే ప్రేమ-పెళ్లి: 1925, జూన్‌ 8న మాన్‌హట్టన్‌లో జన్మించిన బార్బరా పియర్స్‌ ఆష్లే హాల్‌ స్కూల్‌లో గ్రాడ్యువేషన్‌ పూర్తిచేశారు. ఆమెకు 16 ఏళ్లు ఉన్నప్పుడు జార్జ్‌ బుష్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో టెక్సాస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అనంతరకాలంలో బుష్‌ రాజకీయాల్లో ఎదిగి రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారిలో జార్జ్‌ బుష్‌(జూనియర్‌) కూడా దేశాధ్యక్ష పదవి చేపట్టడం తెలిసిందే. ఫస్ట్‌లేడీగా ఉన్న రోజుల్లో అక్షరాస్యత వ్యాప్తి కోసం బార్బరా కృషిచేశారు. బార్బరా-బుష్‌ దంపతుల 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. వారికి ఐదురు సంతానం. 17 మంది మనవళ్లు, మనవరాళ్లు, ఏడుగురు మునిమవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. సీనియర్‌ బుష్‌ (93) సైతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.

మరిన్ని వార్తలు