మృత్యువుతో పోరాడాను..

16 Jun, 2016 01:43 IST|Sakshi
మృత్యువుతో పోరాడాను..

ఆర్లెండో కాల్పుల బాధితుడి వెల్లడి
- ఆరు బుల్లెట్లతో 3 గంటలు నరకయాతన: ఏంజెల్ కలోన్
 
 ఆర్లెండో:   ఈనెల 12న అమెరికాలోని ఆర్లెండో   ‘పల్స్’ నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల షాక్ నుంచి బాధితులు ఇంకా తేరుకోలేదు. ఆ ఘోరాన్ని జ్ఞప్తి చేసుకుంటూ చికిత్స పొందుతున్న బాధితులు ఒకరొకరే మీడియా ముందుకొస్తున్నారు. కాల్పుల ఘటనలో మృత్యువు అంచు వరకూ వెళ్లి ప్రాణాల్తో బయటపడ్డాడు ఏంజెల్ కలోన్ అనే యువకుడు. ఆర్లెండో రీజినల్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న కలొన్ చెప్పిన వివరాలు హృదయవిదారకంగా ఉన్నాయి.  

 ‘అప్పటికే కాలిలో మూడు బుల్లెట్లు దిగడంతో నొప్పి భరించలేకపోతున్నా... కింద పడిపోయా. లేవడానికి ప్రయత్నించినా జనం కాలిపై నుంచి పరుగెట్టడంతో ఎక్కడికీ కదలేకపోయా. దుండగుడు మరోసారి మా వైపే వస్తున్నాడు. కాల్పులు చాలా దగ్గరగా విన్పిస్తున్నాయి. తల పెకైత్తి చూశా... పక్కనే ఉన్న ఒకమ్మాయిపై కాల్పులు జరుపుతున్నాడు.  కదలకుండా పడుకుని ఉన్నా. తర్వాత నేనే... చనిపోవడం ఖాయం అనుకునే లోపే హంతకుడు నా తలపైకి కాల్చాడు. అదృష్టవశాత్తూ రెండు బుల్లెట్లు చేతుల్లోకి దూసుకుపోయాయి. మళ్లీ కాల్పులు... బుల్లెట్ ఈ సారి తొడ భాగంలోకి దూసుకెళ్లింది. బాధతో గొంతు చించుకుని అరవాలనుకున్నా... బతికున్నానని దుండగుడికి తెలియకుండా చచ్చిన వాడిలా పడుకున్నా’ అని కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు. తెల్లవారుజాము 5 గంటలకు పోలీసు వచ్చే వరకూ శరీరంలో ఆరు బుల్లెట్ల బాధను ఓర్చుకుంటూ మృత్యువుతో పోరాడానని అన్నాడు.  
 
 70 మందిని కాపాడిన బౌన్సర్
 పల్స్ క్లబ్ లో బౌన్సర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్ యూసుఫ్ ప్రాణాలకు తెగించి 70 మందిని కాపాడి హీరోగా నిలిచాడు. గతంలో అమెరికా మెరైన్ విభాగంలో పనిచేసిన అనుభవం కాల్పుల సమయంలో చాకచక్యంగా వ్యవహరించేందుకు ఉపయోగపడింది. ‘నేను క్లబ్ వెనుక వైపు ఉన్నా... మూడు నాలుగు కాల్పుల శబ్దాలు వినిపించాయి. అందరూ భయాందోళనలతో  హాలు వెనుక వైపుగా పరుగెట్టడం చూశా. అక్కడ ఉన్న వీధి తలుపు గుండా బయటపడదామని అందరూ అటువైపు వచ్చారు. కానీ తలుపు వేసి ఉండడంతో ఎవరూ తీసేందుకు సాహసించలేదు. తలుపు తెరవండి అంటూ అరిచినా.. భయంతో అందరూ నిలబడిపోయారు. అక్కడే ఉంటే మేమంతా చనిపోవడం ఖాయం... అందుకే పరుగెత్తి వెళ్లి తలుపు గడియ తెరిచా... దాంతో అందరూ క్లబ్ బయటకు పరుగెత్తాం’  అంటూ భీతి గొలిపే సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. దాదాపు 70 మందిని ఆ తలుపు గుండా తప్పించి ప్రశంసలు అందుకున్నాడు.

మరిన్ని వార్తలు