ప్లాస్మా చికిత్సకు దారి దొరికింది...

13 Sep, 2017 03:52 IST|Sakshi
ప్లాస్మా చికిత్సకు దారి దొరికింది...
పదార్థపు నాల్గో స్థితి అనే ప్లాస్మాను వైద్యంలో విరివిగా ఉపయోగించేందుకు మార్గం సులువైంది. మిచిగన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా ప్లాస్మాతో వైద్యం అందుబాటులోకి వస్తే గాయాలు తొందరగా మానడమే కాకుండా.. కేన్సర్‌ కణాలను కూడా సులువుగా చంపేయవచ్చు. అయితే ప్లాస్మా అస్థిరత కారణంగా ఇప్పటివరకూ వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించలేదు. మిచిగన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ లోటును భర్తీ చేశారు. ప్లాస్మాను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోడ్‌ల వద్ద వేడి కారణంగా జనించే ధ్వని తరంగాల వల్ల ప్లాస్మా దిశ, వేగం మారిపోతున్నట్లు వీరు గుర్తించారు.

ఈ రెండింటిని నియంత్రించడం తెలుసుకోగలిగితే ప్లాస్మాను చికిత్సకు వాడటం సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త అమండా లీజ్‌ అంటున్నారు. ప్లాస్మా కారణంగా పుట్టే కొన్ని ఫ్రీ రాడికల్స్‌ కేన్సర్‌ కణాలను చంపేయగలవని, అదే సమయంలో ఇది సాధారణ కణాలకు ఏ హానీ చేయదని ఇప్పటికే గుర్తించినట్లు లీజ్‌ తెలిపారు. ఈ ఫ్రీ రాడికల్స్‌ బ్యాక్టీరియా త్వచాలను బద్దలుకొట్టి వాటిని చంపేస్తాయని, అందువల్ల దీన్ని వైద్య పరికరాలను శుద్ధి చేసేందుకు కూడా వాడవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికాలో చికిత్సలో ప్లాస్మా వాడకంపై నియంత్రణ ఉన్నప్పటికీ యూరప్‌లో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  
మరిన్ని వార్తలు