ఇస్లామాబాద్‌లో హిందూ ఆలయ నిర్మాణం

24 Jun, 2020 15:45 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌లో తొలిసారి హిందూ ఆల‌యాన్ని నిర్మించ‌నున్నారు. ప‌ది కోట్ల రూపాయల ఖ‌ర్చుతో ఆల‌య నిర్మాణం చేపట్టనున్నారు. ఇస్లామాబాద్‌లోని హెచ్‌-9 ప్రాంతంలో సుమారు 20 వేల చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లంలో  శ్రీ కృష్ణ మందిర్ ఆల‌య నిర్మాణం  కోసం బుధవారం శంకుస్థాప‌న చేశారు. పాక్ పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శి లాల్ చంద్ మ‌ల్హీ కార్య‌క్ర‌మానికి హాజ‌రై శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్హీ మాట్లాడుతూ.. ఇస్లామాబాద్‌లో 1947కు ముందు క‌ట్టిన అనేక హిందూ ఆల‌యాలు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వాటిలో సైద్‌పూర్‌ గ్రామంతో పాటు రావాల్‌ నది దగ్గరలో పలు పురాతన ఆలయాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ప్ర‌స్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో వాడ‌కంలో లేవన్నారు. (నేపాల్‌ భూభాగాన్ని ఆక్రమించిన చైనా!)

ఆల‌య నిర్మాణం కోసం కావాల్సిన ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని మ‌త వ్య‌వ‌హారాల శాఖా మంత్రి పీర్ నూరుల్ హ‌క్ ఖాద్రి తెలిపారు. ప్ర‌స్తుతం ప‌ది కోట్ల రూపాయలతో ఆల‌య నిర్మాణం మొద‌లుపెట్టామ‌న్నారు. ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అనుమ‌తితోనే ఈ ఆల‌య నిర్మాణం ప్రారంభించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కాగా ఇస్లామాబాద్‌లో ఉన్న హిందూ పంచాయ‌త్ కొత్త ఆల‌యానికి శ్రీ కృష్ణ మందిర్ అని పేరు పెట్టింది.  ఆల‌యం నిర్మిస్తున్న స్థ‌లాన్ని  క్యాపిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ 2017లో హిందూ పంచాయ‌త్‌కు అప్ప‌గించింది. ఆల‌యం స‌మీపంలో హిందూ శ్మ‌శాన‌వాటిక‌ను కూడా నిర్మించ‌నున్నారు. 

మరిన్ని వార్తలు