400 ఏళ్లనాటి చెట్టు చోరీ 

14 Feb, 2019 13:43 IST|Sakshi

టోక్యో: అప్పుడప్పుడూ విచిత్రమైన దొంగతనాలు జరుగుతుంటాయి. జపాన్‌ రాజధాని టోక్యోలో కూడా అలాంటిదే ఓ చోరీ జరిగింది. ఇంతకీ దొంగలు ఏం ఎత్తుకెళ్లారో తెలుసా? 400 సంవత్సరాలనాటి ఓ చెట్టు! ఆశ్చర్యంగా ఉంది కదూ..  మీరు చదువుతోంది నిజమే. అయితే అది సాధారణ చెట్టుకాదు.. బోన్సాయ్‌ వృక్షం. సీజి ఇమురా, ఆయన భార్య ఈ చోరీ గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విషయం వెలుగుచూసింది. తమ తోట నుంచి ఏడు బోన్సాయ్‌ వృక్షాలను ఎవరో అపహరించారని, దయచేసి వాటిని తిరిగి ఇచ్చేయాల్సిందిగా దంపతులిద్దరూ సోషల్‌ మీడియా ద్వారా వేడుకున్నారు. తెచ్చి ఇచ్చేదాకా వాటిని ఎలా సంరక్షించాలో కూడా వివరించారు.

ఆ చెట్లు ఎంతో అపురూపమైనవని, డబ్బులతో వాటిని వెల కట్టలేమని, తమ బాధను అర్థం చేసుకొని వాటిని అప్పగించాలని వేడుకున్నారు. కాగా దొంగిలించిన బోన్సాయ్‌ చెట్లలో షింపాకు జూనిపర్‌ చెట్టుకు చాలా డిమాండ్‌ ఉంది. ఈ ఒక్క చెట్టు విలువే దాదాపు రూ. 65 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. మిగతా అన్ని చెట్ల విలువ కలిపితే దాదాపు కోటి రూపాయలు దాటవచ్చని చెబుతున్నారు.   
 

మరిన్ని వార్తలు