32 రోజులు.. నరకయాతన.. వర్షపు నీరు తాగుతూ..

12 Feb, 2020 15:21 IST|Sakshi
ప్రాణాలతో బయటపడ్డ పడవ ప్రమాద బాధితులు(కర్టెసీ: ఏఎఫ్‌పీ)

వెల్లింగ్‌టన్‌: దాదాపు నెలరోజుల పాటు పసిఫిక్‌ మహా సముద్రంలో కొట్టుమిట్టాడిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. కార్టెరెట్‌ ఐలాండ్‌లో క్రిస్‌మస్‌ వేడుకలు జరుపుకొనేందుకు మొత్తం 12 మంది వెళ్లగా అందులో ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు బుధవారం పేర్కొంది. వివరాలు... పాపువా న్యూ గినియాలోని బౌగన్‌విల్లే ప్రావిన్స్‌కు చెందిన ఓ బృందం డిసెంబరు 22న కార్టెరెట్‌ ఐలాండ్‌కు వెళ్లారు.

ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడగా.. ఏడుగురు మునిగిపోయారు. ఓ చిన్నపాపతో పాటు మరో నలుగురు బోటును గట్టిగా పట్టుకుని వేలాడుతూ.. అందులోని నీళ్లు తొలగించి.. ప్రాణాలతో బయటపడ్డారు. అయితే సరైన ఆహారం లేకపోవడంతో చిన్నపాప మరణించగా.. ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, పన్నెండేళ్ల బాలిక మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో వీరంతా సముద్ర తీరంలో దొరికిన కొబ్బరికాయలు తింటూ.. వర్షపు నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆఖరికి చేపల వేటకు బయల్దేరిన ఓ సమూహం వీరిని గుర్తించి సాయం అందించడంతో సముద్రం నుంచి బయటపడ్డారు.

ఈ విషయం గురించి బాధితుడు డొమినిక్‌ స్టాలీ మాట్లాడుతూ... ‘‘ఎంతో సంతోషంగా బయల్దేరాం. కానీ మా ప్రయాణం విషాదంగా ముగిసింది. బోటు మునిగిపోయినపుడు మృతదేహాలను ఎలా తీసుకురావాలో.. వాటిని ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే అవి కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదు. చనిపోయిన వారిలో ఓ జంట కూడా ఉంది. వారి చిన్నారిని కొన్నాళ్లపాటు రక్షించగలిగాం గానీ తర్వాత తను చనిపోయింది. ఎన్నో పడవలు మమ్మల్ని దాటుకుని వెళ్లాయి. కానీ ఎవరూ మమ్మల్ని గుర్తించలేదు. ఆఖరికి వేటకు వచ్చిన కొంతమంది జనవరి 23న మమ్మల్ని బయటకు తీసుకువచ్చారు. హోనియారాలో మమ్మల్ని డ్రాప్‌ చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు పాపువా న్యూ గినియాకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా గతంలో కూడా ఓ వ్యక్తి ఇలాగే మెక్సికో పశ్చిమ తీరంలో దాదాపు 13 నెలల పాటు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పచ్చి చేపలు, పక్షుల మాంసం, తాబేలు రక్తం, తన ద్రవ విసర్జనాలు తాగి ప్రాణాలు నిలుపుకొన్నాడు. తొలుత అతడి గురించి వచ్చిన కథనాలను అందరూ కొట్టిపారేసినా పాలిగ్రాఫ్‌ పరీక్షలో అతడు చెప్పినవన్నీ నిజాలని తేలాయి.

మరిన్ని వార్తలు