ఈ బుడ్డోడు పెయింటింగ్‌ వేస్తే.. కాసుల వర్షమే!

3 May, 2018 20:36 IST|Sakshi
అద్వైత్‌ (ఫైల్‌ ఫొటో)

ఆర్ట్‌ అంటే హార్ట్‌తో చూడాలి. అప్పుడే దానిలో నిగూఢంగా దాగి ఉన్నది అర్థమవుతుంది. నాలుగేళ్ల ప్రవాస భారతీయ బుడతడు పెయింటింగ్‌లు వేస్తుంటే లక్షలు కురుస్తున్నాయి. అద్వైత్‌ అనే బుడతడు వేసే పెయింటింగ్‌లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అద్వైత్‌ కొలార్కర్‌ పుణేలో జన్మించాడు. ప్రస్తుతం అతడి కుటుంబం కెనడాలో స్థిరపడింది. తల్లి శ్రుతి కొలార్కర్‌, అద్వైత్‌కు సంబంధించిన విషయాలను చెబుతూ... ఏడాది వయసు​ ఉన్నప్పుడే అద్వైత్‌ పెయింటింగ్‌ బ్రష్‌లను పట్టుకునే వాడనీ, పుణెలో ఒక ఆర్ట్‌ గ్యాలరీ యజమాని, రెండేళ్ల వయసులోనే అద్వైత్‌ ప్రతిభను గుర్తించాడని తెలిపారు. 

ప్రస్తుతం ఈ బుడతడికి సొంతంగా ఆర్ట్‌2డే గ్యాలరీ ఉంది.. కెనడాలోనే పెయింటింగ్‌లను ప్రదర్శించే అతి పిన్న వయస్కుడు అద్వైత్‌ మాత్రమేనని కెనడా సాంస్కృతిక శాఖ అధికారి బెర్నార్డ్‌ కార్మియర్‌ పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని ఆర్ట్‌ ఎక్స్‌పోలో ఏప్రిల్‌ 19-22 మధ్య జరిగిన ప్రదర్శనలో అద్వైత్‌ పెయింటింగ్‌లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘అద్వైత్‌ పెయింటింగ్‌లు వేసేటప్పుడు ఎవరి సలహాలు, సూచనలు, అవసరం ఉండదు. వాడికి నచ్చినట్లు వేస్తాడు. వాడి సంతోషమే మాకు కావాలి. వాడు ప్రస్తుతం ఎలా ఉన్నాడో జీవితాంతం అలానే ఉండాలని కోరుకుంటున్నామ’ని అతడి తల్లి శ్రుతి తెలిపారు.  

మరిన్ని వార్తలు