'ఉల్లిపాయతో కన్నీళ్లు పెట్టుకున్న ఒబామా'

12 Jan, 2016 12:46 IST|Sakshi
'ఉల్లిపాయతో కన్నీళ్లు పెట్టుకున్న ఒబామా'

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటించారని కన్జర్వేటివ్ పొలిటికల్ ఎనలిస్ట్, ఫాక్స్ న్యూస్‌ ఛానల్ వ్యాఖ్యాత ఆండ్రియా టాంటెరోస్ ఆరోపించారు. ఆయన నిజంగా కన్నీళ్లు పెట్టుకోలేదన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. శాండీ హుక్ స్కూల్ లో 2012లో తుపాకీ కాల్పులకు బలైన 20 మంది చిన్నారులను స్మరించుకుంటూ ఒబామా బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒబామా ఏడవడం నమ్మశక్యంగా లేదని టీవీ చర్చా కార్యక్రమంలో ఆండ్రియా పేర్కొన్నారు. కన్నీళ్లు తెచ్చుకోవడానికి ఆయన ఉల్లిపాయ వాడారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. 'ఒబామా మాట్లాడిన తర్వాత వేదిక వద్ద ఉల్లిపాయ లేదా నో మోర్ టియర్స్(జాన్సన్ బేబీ షాంపూ బ్రాండ్ నేమ్) కోసం వెతికాను. ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. అసలే ఇది అవార్డుల సీజన్' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కోహోస్ట్ మిలిసా ఫ్రాన్సిస్ కూడా ఆండ్రియాతో శృతి కలిపింది.

అయితే ఒబామాపై ఫాక్స్ న్యూస్‌ ఛానల్ లో విమర్శలు కొత్త కాదు. గత డిసెంబర్ లో ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎనలిస్ట్ రాల్ప్‌ పీటర్స్, కంట్రిబ్యూటర్ స్టాసీ డాష్ లను రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది.

మరిన్ని వార్తలు