భారత్‌కు 200 మిలియన్‌ యూరోల రుణసాయం!

4 Jun, 2020 16:49 IST|Sakshi

పారిస్‌/న్యూఢిల్లీ: భారత్‌కు 200 మిలియన్‌ యూరోల మేర రాయితీలతో కూడిన రుణాన్ని మంజూరు చేసేందుకు ఫ్రాన్స్‌ ముందుకు వచ్చింది. కోవిడ్‌-19, భయంకర ఉంపన్‌ తుపాను కారణంగా నష్టపోయిన బలహీన వర్గాలను ఆదుకునేందుకు ఈ మేరకు సాయం అందిస్తున్నట్లు ఫ్రాన్స్‌ దౌత్యవర్గాలు వెల్లడించాయి. కాగా ఉంపన్‌ తుపాను భారత్‌లో విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తుపాను బాధితులకు సహాయం చేస్తామని ఆయన స్నేహహస్తం అందించారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్‌ అభివృద్ధి సంస్థ భారత్‌లోని కోవిడ్‌-19, తుపాను బాధితులను ఆదుకునేందుకు 200 మిలియన్‌ యూరోల రుణసాయం అందించనుందని ఫ్రాన్స్‌ అధికారులు వెల్లడించారు. (పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్‌)

ఇక రుణ మంజూరుకు సంబంధించిన ప్రక్రియ పూర్తైందని.. భారత్‌లోని బలహీన వర్గాలకు సామాజిక రక్షణ కల్పించేందుకు ప్రపంచ బ్యాంకు అందించిన సాయానికి ఇది ఊతంలా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. కాగా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో మార్చి 31న ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ఫోన్‌లో సంభాషించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహాయం అందించుకోవాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. ఫ్రాన్స్‌ ప్రారంభించిన కోవిడ్‌ టూల్స్‌ ఆక్సిలేటర్‌(ఏసీటీ- ఏ) ఇనిషియేటివ్‌(జీ-20)కు మద్దతు పలకాల్సిందిగా మాక్రాన్‌ ఈ సందర్భంగా భారత్‌ను కోరినట్లు సమాచారం.(చదవండి: చైనాకు మద్దతు పలికిన నేపాల్‌!)

మరిన్ని వార్తలు