అమెజాన్‌ తగులబడుతోంటే ఆటలేంటి అధ్యక్షా..!

28 Aug, 2019 04:58 IST|Sakshi
బోల్సనోరా , మేక్రాన్‌

‘అమెజాన్‌’కు సాయంపై ఫ్రాన్స్, బ్రెజిల్‌ అధ్యక్షుల విమర్శలు

ఆ వ్యాఖ్యలను మేక్రాన్‌ వెనక్కి తీసుకోవాలన్న జెయిర్‌

అమెజాన్‌ మంటలకు తోడైన పొగ.. ఇబ్బందుల్లో ఫైర్‌ సిబ్బంది

పోర్టో వెల్హో: ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌ తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటేనే జీ–7 నుంచి అమెజాన్‌ కార్చిచ్చు ఆపే సాయం తీసుకునే విషయం ఆలోచిస్తామని బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరా తెలిపారు. అడవుల్లో మంటల్ని ఆర్పడానికి యుద్ధ విమానాలను పంపేందుకు బ్రెజిల్‌కు 2 కోట్ల అమెరికా డాలర్ల సాయాన్ని అందిస్తామని ఫ్రాన్సు అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే. పుడమికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్‌ అడవులు తగలబడిపోతూ ఉంటే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోకూడదని మాక్రాన్‌ జీ7 సదస్సులో చర్చకు పట్టుబట్టి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీనిపై బ్రెజిల్‌ అధ్యక్ష ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫ్రాన్స్‌ అధ్యక్షుడి కృషిని ప్రశంసిస్తున్నాం. అయితే అదంతా యూరప్‌లో అటవీ పునరుద్ధరణకు వాడితే బెటర్‌’ అని అన్నారు.

ఫ్రాన్స్‌లో నోట్రే డామ్‌ చర్చి తగలబడటాన్ని ప్రస్తావిస్తూ  ‘ఒక చర్చిలో మంటలు చెలరేగితే ఆర్పలేని వాళ్లు.. మా దేశానికి పాఠాలు చెబుతారా? అని వ్యంగ్యంగా అన్నారు. అనంతరం బోల్సనారో మాట్లాడుతూ..‘ఫ్రాన్సు సాయాన్ని అంగీకరించాలన్నా ఆ దేశంతో చర్చలు జరపాలన్నా ముందుగా మేక్రాన్‌ నాపై చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. తన భార్య బ్రిగెట్టెపై బోల్సనారో చేసిన వ్యాఖ్యలు తీవ్ర పరుషంగా ఉన్నాయని మేక్రాన్‌ పేర్కొన్నారు. దీనిపై బోల్సనారో స్పందిస్తూ బ్రెజిలేమీ ఫ్రాన్సు కాలనీ కాదు, మనుషులు లేని దీవి అంతకంటే కాదు’ అంటూ ప్రతి దాడికి దిగారు. 

తీవ్రంగా వ్యాపిస్తున్న పొగలు 
అమెజాన్‌ కార్చిచ్చు ఆర్పడానికి బ్రెజిల్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పొగ అడ్డంకిగా మారింది. అమెజాన్‌ అటవీ ప్రాంతంలోని రోన్‌డోనియాలో జకాండా జాతీయ అటవీ ప్రాంతంలో మంటలు విస్తృతంగా వ్యాపిస్తుండడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. అయితే, దట్టంగా పొగలు కమ్మేయడంతో ఏమీ కనిపించక మంటల్ని ఆర్పడం కష్టమైంది. పశు పోషణ కోసం అటవీ ప్రాంతాన్ని చదును చెయ్యడానికి ఆ మంటల్ని పెట్టారని అధికారుల పరిశీలనలో తేలింది.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా