40 అడుగుల ఎత్తు నుంచి దూకిన చిన్నారులు

23 Jul, 2020 14:57 IST|Sakshi

పారిస్‌‌: భూమ్మీద నూకలుండాలే గాని ఎలాంటి ప్రమాదం నుంచైనా బతికి బట్టకట్టవచ్చు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. గ్రెనోబుల్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. దానిలో నివసించే వారంతా భయందోళనలకు గురవుతూ భయటకు పరుగులు తీశారు. మూడో అంతస్తులోని ఓ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దవాడి వయసు 10 సంవత్సరాలు కాగా చిన్నపిల్లాడి వయసు మూడు సంవత్సరాలు. తల్లిదండ్రులు భయటకు వెళ్తూ పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లారు. వారి దగ్గర మరో తాళం చెవి కూడా లేదు. ఈ లోపు అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి.. దట్టమైన పొగ కమ్ముకుంది. బయటకు వచ్చే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలకే సరిగా తోచదు. మరి ఆ పసివాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొండి. (వీటిలో జాగ్వారేదో.. చిరుతేదో చెప్పగలరా?)
 

పిల్లలు కూడా చాలా భయపడ్డారు. కానీ ప్రాణాలు రక్షించుకోవాలనే కోరికతో దాదాపు 40 అడుగుల పై నుంచి ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు. అప్పటికే కింద రెడీగా ఉ‍న్న రెస్క్యూ టీమ్‌ పిల్లలను జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు. అంత పై నుంచి దూకినప్పటికి.. పిల్లలిద్దరికి ఒక్క దెబ్బ కూడా తగలకపోవడం గమనార్హం. కేవలం పొగతో ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. చిన్నారులిద్దరూ చాలా అదృష్టవంతులంటూ చుట్టూ ఉన్న వారు ప్రశంసిస్తున్నారు. ఈ మొత్తం సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. చిన్నారులు ఎంతో అదృష్టవంతులు అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

>
మరిన్ని వార్తలు