ఫ్రాన్స్‌లో యథావిధిగా ‘స్థానిక’ ఎన్నికలు

16 Mar, 2020 09:31 IST|Sakshi

కరోనాతో ఆ దేశంలో 91మంది మృత్యువాత

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ఫ్రాన్స్‌ ప్రభుత్వం దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలను ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే జరిపించాలని నిర్ణయించింది. ఫ్రాన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కరోనాతో ఆ దేశంలో ఇప్పటి వరకు 91మంది మరణించగా, 2,900 మంది కరోనా బారినపడ్డారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సృష్టించిన సంక్షోభం మొదటి దశలోనే ఉన్నామన్నారు.  ఆదివారం నుంచి దేశంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తామన్నారు. కాగా కరోనాను సాకుగా చూపుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. (ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ)

కరోనా తీవ్రత లేనప్పటికీ ఎన్నికలను వాయిదా వేయాలని కమినషర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా.. దేశంలో మాత్రం అంత ప్రభావం చూపడంలేదు. ముఖ్యంగా ఏపీలో ఇంతవరకూ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయినా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతూ.. ప్రజలకు పలు సూచనలు, సలహాలు చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్‌ సోకే అవకాశం ఉండటంతో విమానాశ్రయాల్లోనే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతోంది. (చదవండి: ఎన్నికలకు ఎల్లో వైరస్‌)

మరిన్ని వార్తలు