ఫ్రెంచ్‌ హీరో ఆఫీసర్‌.. అమరుడయ్యారు..

24 Mar, 2018 17:48 IST|Sakshi
లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఆర్నాడ్‌ బెల్ట్రేమ్‌ (పాత ఫొటో)

టెబ్రెస్‌, ఫ్రాన్స్‌ : ఉగ్ర నరరూప రాక్షసుడి నుంచి పౌరులను రక్షించేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఫ్రాన్స్‌ అధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఆర్నాడ్‌ బెల్ట్రేమ్‌ అమరడయ్యారు. ఓ మహిళను బందీగా చేసేందుకు యత్నిస్తున్న ఉగ్రవాది వద్దకు తానే బందీగా వెళ్లారు. శుక్రవారం టెబ్రెస్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌కి సాయుధుడు చొరబడి పోలీస్‌పై కాల్పులు జరిపి అక్కడి వారిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే.

దుండగుడు కాల్పులకు ముగ్గురు బందీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలోనే మార్కెట్‌లో మహిళను బందీగా చేసుకునేందుకు ఉగ్రవాది యత్నించాడు. మహిళకు బదులు తాను బందీగా వస్తానని ఉగ్రవాదితో చెప్పిన కల్నల్‌ తన ఆయుధాన్ని కిందపడేసి ఉగ్రవాది వద్దకు వెళ్లాడు. అదే సమయంలో లోపల ఏం జరుగుతోందన్న విషయాన్ని అధికారులకు తెలిసేలా ఫోన్‌ను ఆన్‌ చేసి వదిలేశారు ఆర్నాడ్‌.

బందీగా చిక్కిన బెల్టేమ్‌పై ఉగ్రవాది విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఉగ్రవాదిని మట్లుబెట్టిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. శనివారం చికిత్స పొందుతూ కల్నల్‌ తుదిశ్వాస విడిచినట్లు ఫ్రాన్స్‌ అధికారులు ప్రకటించారు. దీంతో ఉగ్రదాడిలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. దేశం పట్ల ప్రేమతో పౌరుల రక్షణకు ప్రాణ త్యాగానికి వెనుకాడని ఆర్నాడ్‌ను ఫ్రాన్స్‌ ప్రజలు నిజమైన హీరోగా కీర్తిస్తున్నారు.

మరిన్ని వార్తలు